
ghmc-revanth-reddy Photograph: (ghmc-revanth-reddy)
ప్రపంచంలోని టాప్ సీటీల్లో హైదరాబాద్ ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి హైదరాబాద్ ను మరింత డెవలప్ చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ సిటీలతో పాటుగా ఫ్యూచర్ సిటీ పేరుతో ఫోర్త్ సిటీని కూడా నిర్మిస్తున్నారు. దాదాపుగా 20 ఎకరాల్లో దీనిని విస్తరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నగర విస్తరణలో భాగంగా రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
అదేంటంటే.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని ఔటర్ రింగు రోడ్డు (ORR) వరకూ పెంచాలనుకుంటోంది. 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లనను గ్రేటర్‌లో కలపాలని భావిస్తోంది. దీనిపై సాధ్యాసాధ్యాలపై స్పెషల్ గా ఓ కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా త్వరలో దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది.
జీహెచ్‌ఎంసీ కాకుండా ఓఆర్‌ఆర్ లోపల 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉన్నాయి. హైదరాబాద్ నగరంతో పోలిస్తే డెవలప్ మెంట్ విషయంలో ఇవి చాలా వెనుకపడ్డాయనే చెప్పాలి. ఈక్రమంలో ఓఆర్‌ఆర్ వరకూ నగరాన్ని ఒకేవిధంగా డెవలప్ చేసేందుకు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
దీంతో జీహెచ్‌ఎంసీ పరిధి 2 వేల చదరపు కిలోమీటర్లకు వరకు విస్తరిస్తుంది. అయితే భారీ విస్తీర్ణం నేపథ్యంలో పరిపాలనకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఈ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే జీహెచ్‌ఎంసీని రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విడగొట్టాలని అధికారులు భావిస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం అయ్యాక దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఇక 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల గడువు జనవరి నెలతో ముగియనుంది. వాటికి ఎన్నికలు నిర్వహించే లోపు.. విలీనానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను కమిటీ అధ్యయనం చేయనుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా విలీనంపై సర్కార్ తుది నిర్ణయం తీసుకోనుంది.