Hyderabad Metro : ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో...HMRL ఛైర్మన్‌గా సీఎస్ రామకృష్ణ రావు

హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టును ప్రైవేట్ భాగస్వామ్య సంస్థ ఎల్ అండ్ టీ (L&T) నుంచి స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.15 వేల కోట్లతో 100 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేయనుంది.

New Update
Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. ఈ భారీ ప్రాజెక్టును ప్రైవేట్ భాగస్వామ్య సంస్థ ఎల్ అండ్ టీ (L&T) నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సుమారు రూ.15 వేల కోట్లతో 100 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

 ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఈ కొనుగోలు మరియు బదిలీ ప్రక్రియను పూర్తి చేసి, మే 1వ తేదీ నుంచి మెట్రో రైలును పూర్తిగా ప్రభుత్వ పరం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కీలకమైన స్వాధీన ప్రక్రియ కోసం భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి రూ.13,615 కోట్ల మేర రుణం మంజూరుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను ప్రభుత్వం ఆమోదించింది. ఇందుకు అవసరమైన గ్యారంటీ పత్రాలు ,ఇతర ఒప్పందాలపై సంతకాలు చేసే అధికారాన్ని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి, హెచ్‌ఎమ్మార్‌ఎల్ (HMRL) ఎండీకి అప్పగిస్తూ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు.

 ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన నేపథ్యంలో మెట్రో రైల్ బోర్డును కూడా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణరావును బోర్డు చైర్మన్‌గా నియమించగా, సర్ఫరాజ్ అహ్మద్‌ను మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగించాలని నిర్ణయించింది. బోర్డు డైరెక్టర్లుగా సీనియర్ అధికారులు జయేశ్ రంజన్, వికాస్ రాజ్, సుల్తానియా , ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. మెజార్టీ షేర్ హోల్డర్‌గా ప్రభుత్వం మారడంతో పాటు, నామినీ షేర్‌హోల్డర్లకు ఒక్కో షేర్ కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

 ఇకపై మెట్రో రైలు నిర్వహణ, సిబ్బంది నియామకం, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలు అన్నీ నేరుగా ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరగనున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం హైదరాబాద్ మెట్రో భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది.

Advertisment
తాజా కథనాలు