/rtv/media/media_files/2026/05/29/cm-revanth-2026-05-29-19-49-42.jpg)
CM Revanth Reddy
EHS : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య భద్రతకు సంబంధించిన కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) ఈ నెల నుంచే అమల్లోకి రానుంది. దాదాపు 7.5 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చే ఈ పథకంపై తుది కసరత్తు ఇప్పటికే కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఉన్నతాధికారుల తో నిర్వహించబోయే సమీక్షా సమావేశంలో ఇందుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
కొత్త ఆరోగ్య పథకాన్ని స్వయంప్రతిపత్తి కలిగిన ‘ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్ట్’ ద్వారా ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో ట్రస్టు కమిటీ అధికారిక ప్రకటనతో పాటు పథకం యొక్క పూర్తి మార్గదర్శకాలు సోమవారమే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల తరఫున ఇద్దరు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఒక సీనియర్ అధికారిని ఈ ట్రస్ట్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమించనున్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే అధికారిక వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రతీకాత్మకంగా తొలి విడతలో 50 మంది ఉద్యోగులకు వేదికపైనే కొత్త ఈహెచ్‌ఎస్ కార్డులను అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఆ రోజు వీలుపడకపోతే, జూన్ 10వ తేదీ లోపు ఎలాగైనా డిజిటల్ కార్డుల పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.కొత్త ఈహెచ్‌ఎస్ కింద క్యాష్‌లెస్ (నగదు రహిత) చికిత్స సేవలు అందించడానికి అవసరమైన లబ్ధిదారుల వివరాల సేకరణ ఇప్పటికే ముగిసింది. రాష్ట్రంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలను మే 31 లోపు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆర్థిక శాఖ గతంలోనే ఆదేశించింది. ఈ వివరాల ఆధారంగానే లబ్ధిదారులందరికీ డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేయనున్నారు.
జీతాల్లో కోతపై ప్రశ్నలు,,,ఉద్యోగ సంఘాల తీవ్ర ఆగ్రహం,
ఈ కొత్త హెల్త్ స్కీమ్ నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు తమ బేసిక్ పే (ప్రాథమిక వేతనం) నుంచి ప్రతి నెలా 1.5 శాతాన్ని తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు మే నెల వేతనం నుంచే ఆర్థిక శాఖ ఈ మొత్తాన్ని మినహాయించింది (కట్ చేసింది). అయితే, పథకానికి సంబంధించిన పూర్తి విధివిధానాలు, చికిత్స లభించే ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల జాబితా, ప్యాకేజీల వివరాలు ప్రకటించకుండానే అప్పుడే జీతాల్లో కోత పెట్టడంపై కొందరు ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొదట ట్రస్టులో నిధులు జమ అయ్యాకే స్కీమ్ సేవలు ప్రారంభమవుతాయని ఉద్యోగ సంఘాల నేతలు దీనిపై వివరణ ఇస్తున్నారు.
మరోవైపు, ఎటువంటి ముందస్తు జీవో (GO) లేకుండా, ఉద్యోగుల సమ్మతి తీసుకోకుండా ఏకపక్షంగా మే నెల జీతాల్లో 1.5 శాతం అప్రకటిత కోత విధించడంపై డీటీఎఫ్, టీఎస్‌సీపీఎస్‌ఈయూ వంటి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం జీతాలు, పెన్షన్లు అనేవి ఉద్యోగి ఆస్తి హక్కు పరిధిలోకి వస్తాయని, కనీస నిబంధనలు ఖరారు చేయకుండా జీతాన్ని కోయడం రాజ్యాంగ విరుద్ధమని సంఘాల నేతలు మండిపడ్డారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైన వారికి మినహాయింపులపై స్పష్టత ఇవ్వాలని, కట్ చేసిన సొమ్మును వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరపకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ ఉత్కంఠ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)తో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశం కానున్నారు.
Follow Us