/rtv/media/media_files/2026/03/23/telangana-cabinet-approves-several-key-bills-2026-03-23-21-15-09.jpg)
Telangana Cabinet
Telangana Cabinet :శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర పురోగతికి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా వచ్చే ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2027 గోదావరి పుష్కరాల నిర్వహణ, అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ.1,000 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకోగా, అందులో ప్రాథమిక పనుల నిమిత్తం తొలి విడతగా రూ.300 కోట్లను తక్షణమే విడుదల చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ కేబినెట్ భేటీలో తీసుకున్న మరో కీలక నిర్ణయం ప్రకారం.. దేశ భద్రతా బలగాలైన బిఎస్ఎఫ్ (BSF), సిఐఎస్ఎఫ్ (CISF) గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణలో భూములను కేటాయించారు. కరీంనగర్ జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఈ భూ కేటాయింపులు జరిగాయి. ఇందులో భాగంగా వెలిది గ్రామంలో 4 ఎకరాలు, రుక్మాపూర్‌లో 5 ఎకరాలు, అలాగే గన్నేరువరంలో మరో 5 ఎకరాల భూమిని ఆయా భద్రతా విభాగాల అవసరాల కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులకు ఆమోదముద్ర వేసింది.
రాష్ట్రంలో నిరుపేదల సొంతింటి కలను నైజం చేసేందుకు ఉద్దేశించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతపై ఈ సమావేశంలో మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. ఈ పథకాన్ని మూడు లేదా నాలుగు విడతల్లో లబ్ధిదారులకు చేరవేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18,500 పూరిగుడిసెలను ప్రభుత్వం గుర్తించిందని, అర్హులైన వారందరికీ వారి స్వంత నియోజకవర్గాల్లోనే ఇళ్లను నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన మరో 500 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు వీలుగా త్వరలోనే నిధులను మంజూరు చేయనున్నట్లు వివరించారు.
సొంతంగా ఇళ్ల స్థలాలు ఉండి, ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్న అర్హులైన పేదలకు ఈ కేబినెట్ సమావేశం ద్వారా ప్రభుత్వం పెద్ద గుడ్‌న్యూస్ చెప్పింది. అలాంటి లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ ఆర్థిక సాయం కింద రూ.5 లక్షలు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరు నుంచే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రొసీడింగ్స్ (నిర్ణీత ప్రక్రియ) ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జూన్ 1వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ రెండో విడతలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను అర్హులైన పేదలకు ప్రభుత్వం అందజేయనుంది.
Follow Us