/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/dsc-1-jpg.webp)
డీఎస్సీ 2008 బాధిత అభ్యర్ధులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. కాంట్రాక్ టీచర్ ఉద్యోగాలను డీఎస్సీ-2008 అభ్యర్థులను ఇవ్వాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా 2008 డీఎస్సీలో నష్టపోయిన 1382 మందికి సెకండరీ గ్రేడ్ టీచర్లుగా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ పద్ధతిలో పని చేసేందుకు అంగీకారం పత్రం సమర్పించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగంలో జాయిన్ అయినవారిని ప్రతీ విద్య సంవత్సర్ రెన్యువల్ చేస్తామని తెలిపింది.
అభ్యర్థులు హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. ఇందులో భాగంగా డీఈడీ ఉన్న వారికి 30 శాతం ఎస్‌జీటీ పోస్టులు కేటాయించింది. దీనికి సబంధించి 30 శాతం రిజర్వేషన్ వల్ల నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం ఇప్పటికే సమాచారం ఇచ్చింది. ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన జరిగిపోయింది. ఇక కాంట్రాక్టు టీచర్లుగా జాయిన్ వారికి నెలకు రూ. 31, 040 జీతం చెల్లించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం ఇప్పటికే మెరిట్ లిస్ట్ ను తయారు చేశారు. ఇప్పుడు వారికి హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో కౌన్సిలింగ్ నిర్వహించి, నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు.
16 ఏళ్ళుగా ఎదురు చూపులు...
2008లో అప్పటి ప్రభుత్వం మెగా డీఎస్సీని ప్రకటించింది. ఎస్జీటీ ఉద్యోగాలకు బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆతర్వాత ఎస్జీటీ పోస్టుల్లో 30% డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది చట్ట విరుద్ధమని బీఈడీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకారమే ఫలితాలు విడుదల చేసి.. కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించింది. డీఈడీ అభ్యర్థులు పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, 30% కోటా ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి అభ్యర్థులు 14 ఏళ్ళుగా కోర్టులు, ప్రభుత్వాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని గత ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also read : వల్లభనేని వంశీ అరెస్ట్..ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు!