/rtv/media/media_files/2026/05/20/marriage-2026-05-20-12-01-02.jpg)
చట్టాన్ని రక్షించి, సమాజంలో బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన పోలీసు అధికారి దారితప్పాడు. అధిక కట్నానికి ఆశపడి మైనర్ బాలికను అర్ధరాత్రి వేళ రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకోగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మైనర్ బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మైనర్ బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్ అనిల్ కుమార్.. ICDSకు సమాచారం అందించిన స్థానికులు బాల్యవివాహం చేసిన వారిపై కేసు నమోదు చేసిన హుజూర్ నగర్ పోలీసులు pic.twitter.com/3CTK7bfBSd
— dktimestelugu (@dktimestelugu) May 20, 2026
ఐసీడీఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్ అనే వ్యక్తి సొంత ఊరు సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలోని సీతారాంపురం . ఈ నెల 9వ తేదీన అనిల్ కుమార్.. అనంతగిరి మండలానికి చెందిన ఒక మైనర్ బాలికను నమ్మించి, భారీగా కట్నకానుకలు ఆశించి అర్ధరాత్రి సమయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.
కానిస్టేబుల్ పై ఫిర్యాదు
బాలిక మైనర్ అనే విషయం తెలియడంతో రంగంలోకి దిగిన ఐసీడీఎస్ అధికారులు ఈ బాల్య వివాహంపై సమగ్ర విచారణ జరిపారు. అనంతరం హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ అనిల్ కుమార్‌పై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు నిందితుడు అనిల్ గౌడ్‌పై బాల్య వివాహాల నిరోధక చట్టంతో పాటు పలు కఠినమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తమ సొంత శాఖకు చెందిన కానిస్టేబుల్‌పైనే కేసు నమోదు కావడంతో సూర్యాపేట పోలీసులు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ అనిల్ గౌడ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. విధుల్లో ఉంటూ చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ సదరు కానిస్టేబుల్‌పై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.
Follow Us