గవర్నర్ సూచనకు ఓకే చెప్పిన సీఎం రేవంత్.. భేటీకి అసలు కారణం ఇదేనా?

సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిశారు. ఆయనతోపాటు మంత్రి శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు వేం రెడ్డి నరేందర్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న MLC నామినేషన్లు, విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల నియంత్రణపై చర్చించారు.

New Update
_CM Revanth Reddy (1)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు వేం రెడ్డి నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సుమారు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్సీ నామినేషన్లు, విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల నియంత్రణపై చర్చించారు.

అజారుద్దీన్ పదవి ఉంటుందా? ఊడుతుందా?

ఈ సమావేశంలో అత్యంత కీలకమైన అంశం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం. రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్న మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్, అలాగే తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పేర్లను ఎమ్మెల్సీలుగా ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌ను కోరారు.

ప్రస్తుతం అజారుద్దీన్ ఏ సభలోనూ సభ్యుడు కాకుండానే మంత్రిగా కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల లోపు ఏదో ఒక సభ (అసెంబ్లీ లేదా కౌన్సిల్) సభ్యుడిగా ఎన్నిక కావాలి. అజారుద్దీన్ పదవీ కాలం ఈ నెల 30తో ఆరు నెలలు పూర్తి కానుంది. అంటే, మరో పది రోజుల్లోగా గవర్నర్ ఈ ఫైలుపై సంతకం చేయకపోతే అజారుద్దీన్ తన మంత్రి పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం స్వయంగా వెళ్లి గవర్నర్‌కు విన్నవించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం

రాజకీయ అంశాలతో పాటు విద్యా వ్యవస్థలో సంస్కరణలపై కూడా చర్చ జరిగింది. జూన్ 12న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న భారీ అవగాహన కార్యక్రమానికి గవర్నర్‌ను సీఎం ఆహ్వానించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా కీలక సూచనలు చేశారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు విద్యార్థుల్లో అవగాహన పెంచాలని గవర్నర్ సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో అడ్మిషన్ల సమయంలోనే విద్యార్థుల నుంచి 'డ్రగ్స్‌కు దూరంగా ఉంటాం' అనే హామీ పత్రాన్ని తీసుకోవాలని, వారితో ప్రమాణం చేయించాలని కోరారు.

గవర్నర్ సూచనలను సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అజారుద్దీన్, కోదండరామ్ ఎమ్మెల్సీ ఫైలుపై గవర్నర్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు