/rtv/media/media_files/xuwpsSA6ABVfhNQGCEGT.jpg)
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రకృతి విపత్తుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించిన సీఎం.. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలపై జూన్ 1నే నిర్వహించిన రివ్యూలో అన్ని ముందస్తు సూచనలు ఇచ్చినప్పటికీ, జూన్ 9న వర్షం వచ్చినప్పుడు అధికారులు సరిగా పనిచేయలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
వర్షం కురిసిన సమయంలో అత్యంత కీలకమైన ప్రాంతాలలో మున్సిపల్, పోలీస్ అధికారుల మధ్య కనీస సమన్వయం లేకపోవడాన్ని ముఖ్యమంత్రి తప్పుబట్టారు. ఇకపై వర్షం పడినప్పుడు నీరు నిలిచే ప్రాంతాలు, ప్రమాదకర ప్రాంతాలు విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే ప్రాంతాల డేటా ఆధారంగా ప్రణాళికాబద్ధంగా పని చేయాలని ఆదేశించారు. మానవ తప్పిదాల వల్ల గానీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల గానీ ప్రజలకు సమస్యలు వస్తే అస్సలు సహించేది లేదని స్పష్టం చేశారు.
వర్షం కురుస్తున్న సమయంలో ఊరికే ఏసీ గదుల్లో కూర్చుంటే కుదరదని, ఫీల్డ్‌లో ఉండని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. "వర్షం పడేటప్పుడు ట్రాఫిక్ ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ రోడ్లపైనే ఉండి పరిస్థితిని చక్కదిద్దాలి. అవసరమైతే ముఖ్యమంత్రినైన నేను కూడా స్వయంగా రోడ్డు మీదికి వస్తాను" అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అలాగే వర్షాల కారణంగా ఎక్కడా విద్యుత్ అంతరాయం కలగకుండా, ప్రమాదాలు జరగకుండా విద్యుత్‌శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఆదేశించారు.
కఠిన చర్యలు ఉంటాయి
నగరంలో వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన సీఎం.. ట్రాఫిక్ నియంత్రణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఇందులో భాగంగానే ట్రాఫిక్ విభాగంలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ముగిసేవరకు అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా ఉంటూ, పరస్పర సమన్వయంతో ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు తెలంగాణలో రాగల మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్‌లు జారీ చేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని, రాబోయే నాలుగైదు రోజుల్లో ఇవి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని అధికారులు పేర్కొన్నారు.
Follow Us