/rtv/media/media_files/2024/11/17/VtM1mq3lbQqiJkWOvuan.jpg)
సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కవిత జైలుకు వెళ్లిన తర్వాత, పార్టీ పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రి కావాలని హరీష్ రావు, కేటీఆర్ ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇంటి బిడ్డను సరిగ్గా చూసుకోకపోవడం వల్లే ఆ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకాల్లో తేడాలు రావడం వల్లే ఇప్పుడు బయటపడి కొట్టుకుంటున్నారని, ఇది వారి సొంత ఇంటి సమస్య అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం వేళ మీడియా సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.
ప్రభాకర్ రావు పాత్ర అత్యంత కీలకం
ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాత్ర అత్యంత కీలకమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభాకర్ రావు సుమారు 20 నెలల పాటు విదేశాల్లో తలదాచుకున్నారని, అతడిని వెనక్కి రప్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అయితే, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆదేశాలు జారీ చేయడంతోనే ఆయన స్వదేశానికి రావాల్సి వచ్చిందని, ఆయన రాకతోనే ఈ కేసు విచారణ ఇప్పుడు వేగవంతమైందని రేవంత్ వివరించారు. ఈ కేసులో అసలు దోషులెవరో త్వరలోనే తేలుతుందన్నారు సీఎం.
ఇక ఏపీలో చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్పందిస్తూ, అది పొరుగు రాష్ట్రానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. అయితే, తెలంగాణలో ముందుజాగ్రత్తగా అన్ని ప్రధాన దేవాలయాల్లో ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ నెయ్యిని మాత్రమే వాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
Follow Us