Hyderabad : హైదరాబాద్‌లో కారు డ్రైవర్ రాక్షసత్వం... బానెట్‌పై బాధితుడిని 2 కి.మీ ఈడ్చుకెళ్లిన వైనం

భాగ్యనగరంలో మరోసారి మానవత్వాన్ని మంటగలిపేలా జరిగిన 'హిట్ అండ్ రన్' ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఒక కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. కారుతో ఢీ కొట్టడమే కాకుండా బాధితుడిని కిలోమీటర్ల మేర బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

New Update
FotoJet - 2026-05-03T115739.738

Car driver's brutality in Hyderabad... dragged victim 2 km on bonnet

Hyderabad : భాగ్యనగరంలో మరోసారి మానవత్వాన్ని మంటగలిపేలా జరిగిన 'హిట్ అండ్ రన్' ఘటన సంచలనం సృష్టిస్తోంది. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ కిరాతక ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

నగరంలోని రోడ్లపై భద్రత ఏ స్థాయిలో ఉందో ప్రశ్నార్థకంగా మారుస్తూ మీర్‌పేట్‌లో ఒక కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. కేవలం కారుతో ఢీ కొట్టడమే కాకుండా బాధితుడిని కిలోమీటర్ల మేర బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మే 1వ తేదీన, ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్తో కలిసి బైక్‌పై గాయత్రి నగర్ నుంచి ఎల్బీనగర్ వైపు వెళ్తున్నారు. మీర్‌పేట్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో కిందపడిపోయిన జిలానీ, ఫైసల్.. కారు డ్రైవర్‌ను నిలదీశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కారు డ్రైవర్ బాధితులపై దాడి చేయడమే కాకుండా, అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.

డ్రైవర్ పారిపోకుండా అడ్డుకునేందుకు జిలానీ కారు ముందు నిలబడగా, డ్రైవర్ ఏమాత్రం కనికరం లేకుండా వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి జిలానీ కారు బానెట్‌ను గట్టిగా పట్టుకోగా, డ్రైవర్ కారును ఆపకుండా సుమారు 2 కిలోమీటర్ల మేర వేగంగా లాక్కెళ్లాడు. బాధితుడు నొప్పితో అరుస్తున్నా, చుట్టుపక్కల వాహనదారులు వారించినా డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోకుండా బాలాపూర్ క్రాస్‌రోడ్స్ మీదుగా మందమల్లమ్మ జంక్షన్ వరకు రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు.కారుపై మనిషి వేలాడుతున్న దృశ్యాన్ని చూసిన స్థానికులు ధైర్యంగా స్పందించారు. మందమల్లమ్మ చౌరస్తా వద్ద వాహనాన్ని చుట్టుముట్టి అడ్డగించడంతో డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో జిలానీ కుమారుడు ఫైసల్ రెండు కాళ్లు విరిగిపోయి, తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సమాచారం. జిలానీ కూడా ఈడ్చుకెళ్లిన క్రమంలో తీవ్రంగా గాయపడ్డారు.

 సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం,హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేశారు. నగరంలో ఇలాంటి ఉన్మాద చర్యలు పెరిగిపోతుండటం పట్ల సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో కఠినమైన శిక్షలు అమలు చేయాలని, రోడ్డుపై గొడవలను హింసగా మార్చే వారి లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు