Telangana Budget 2026 : మార్చి రెండో వారంలో బడ్జెట్‌ సమావేశాలు.. ఎన్నిరోజులో తెలుసా?

తెలంగాణలో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనికోసం ఈ నెల 23న క్యాబినెట్‌ సమావేశం నిర్వహించనుంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బడ్జెట్‌ సమావేశాలు మార్చి రెండో వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

New Update
 Telangana Assembly

Telangana Assembly

Telangana Budget 2026: తెలంగాణలో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనికోసం ఈ నెల 23న క్యాబినెట్‌ సమావేశం నిర్వహించనుంది. ఆ సమావేశంలో బడ్జెట్‌ సమావేశాలు ఎప్పుడు నిర్వహించేది తేలనుంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బడ్జెట్‌ సమావేశాలు మార్చి రెండో వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే సోషల్ మీడియాలో ఈనెల 26 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయని.. 28న బడ్జెట్ ప్రవేశ పెడుతారని .. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెడుతారని ప్రచారం ఊపందుకుంది. ఈ బడ్జెట్ సమావేశాలు 10 నుంచి 15 రోజులు పాటు జరగనున్నట్లు కూడా ప్రచారం సాగింది. 

అయితే రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మార్చి రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఎమ్మె్ల్యేలందరూ పాల్గొనాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అప్పటికీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూ ఉంటే ఓటింగ్‌కు అందరూ అందుబాటలో ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పదో తేదీ తర్వాత బడ్జెట్ సమావేశాలు ప్రారంభించే దిశగా సర్కారు కసరత్తు చేస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ సమావేశాలను పది నుంచి పదిహేను రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ లెక్కన 10 తేదిన ప్రారంభించి 20 లేదా 25 వరకు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ భావిస్తోంది. అయితే బడ్జెట్‌ సమావేశాల మొదటి రోజున జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు కొనసాగాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 23న మంత్రిమండలి సమావేశం జరగనుంది. భేటీ అనంతరం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు, రైతు భరోసా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.  

కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌ సమావేశాల నిర్వహణకు ఆమోదం తెలుపుతూ కేబినెట్‌ తేదీ ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే బడ్జెట్‌ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. శాఖల వారీగా జరుగుతున్న ఈ సమావేశాల్లో ఆయా విభాగాలకు కేటాయించిన నిధులు, ఖర్చు చేసిన మొత్తం, రాబోయే బడ్జెట్‌లో విజన్‌–2047 లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన నిధులపై చర్చలు సాగిస్తున్నారు. ప్రభుత్వం అనుకున్నట్లు వచ్చే నెల పదో తేదీ తర్వాత బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు మొత్తం బడ్జెట్‌ తయారీ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికార వర్గాలు ప్లాన్‌ చేస్తున్నాయి. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగిస్తారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండు రోజుల పాటు చర్చ జరుగుతుంది. అనంతరం ఆమోదం లభిస్తుంది. 

ఆ తరువాత ఒకటి లేదా రెండు రోజుల విరామం ఇచ్చి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌పై రెండు నుంచి మూడు రోజులపాటు చర్చ జరిగే అవకాశం ఉంది. అనంతరం శాఖల వారీగా పద్దుల కేటాయింపులు, ప్రజా సమస్యలపై మూడు నుంచి నాలుగు రోజులపాటు చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ద్రవ్య వినియోగ బిల్లును ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఈసారి బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీల అమలు, రైతు సంక్షేమం, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలకు ప్రాధాన్యత లభించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. మార్చి నాలుగో వారం నాటికి బడ్జెట్‌ సమావేశాలు ముగిసే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రతిపక్షాల ఆందోళనలు, ఇతర కారణాలతో పాటు బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ తీసుకునే నిర్ణయం పై సమావేశాలు ఆధారపడి ఉన్నాయి.  

Advertisment
తాజా కథనాలు