/rtv/media/media_files/2026/04/29/fotojet-2026-04-29-08-34-02.jpg)
BRS Working President KTR
BRS : తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరును ఉధృతం చేసేందుకు బీఆర్‌ఎస్ (BRS) కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట నాలుగేళ్ల క్రితం అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు దాటినా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రైతాంగాన్ని మోసం చేసిందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. నాలుగేళ్ల క్రితం మే 6న రాహుల్ గాంధీ వరంగల్‌లో ఇచ్చిన హామీలు, జరిగిన మోసాలను ప్రజలకు గుర్తు చేసేలా.. అదే రోజున (మే 6న) వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
హైదరాబాద్‌లో మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో జరిగిన సమీక్షా సమావేశంలో కేటీఆర్ పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించిన ఆయన, త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి బూత్‌లో దొంగ ఓట్లు నమోదు కాకుండా అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం కుదేలైందని, ఎరువులు, విత్తనాల కొరతతో పాటు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు కోతలు, రైతు ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయని ఆరోపిస్తూ, రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌పై ఉందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు.
పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా గ్రామ, వార్డు స్థాయి నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియను ముమ్మరం చేయాలని నేతలు నిర్ణయించారు. నియోజకవర్గాల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి, పార్టీ పనితీరును మెరుగుపరుచుకోవాలని కేటీఆర్ సూచించారు. కష్టపడి పనిచేసే వారికే రాబోయే మండల పరిషత్, జిల్లా పరిషత్ ,కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. వరంగల్ కార్పొరేషన్‌లో మళ్లీ పాగా వేయడమే లక్ష్యంగా డివిజన్ల వారీగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
జగిత్యాల సభ ,పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత నేతల్లో నెలకొన్న జోష్‌ను కొనసాగిస్తూ అధికార పక్షానికి ధీటుగా నిలబడాలని పార్టీ భావిస్తోంది. ఈ సమావేశంలో మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా, అందరూ కలిసికట్టుగా అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
Follow Us