తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి పోర్టల్ ప్రారంభమయ్యింది. హైదరాబాద్‌లో శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ దీన్ని ప్రారంభించారు. ముందుగా ప్రయోగాత్మకంగా ఈ పోర్టల్‌ను మూడు మండలాల్లో అమలు చేయనున్నారు. జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్తాయిలో అమలు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పోర్టల్‌కు సంబంధించి ప్రజల నుంచి అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించి.. తగిన మార్పులు చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ అధికారులకు ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎప్పటికప్పుడు భూభారతి పోర్టల్‌ను అప్‌డేట్ చేయనున్నారు.
Also Read: గ్రూప్-1 అవకతవకలపై సీబీఐ విచారణ చేయాలి: పాడి కౌశిక్ రెడ్డి
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. '' గత ప్రభుత్వం దొరలు, భూస్వాములకు అనుకూలంగా ధరణి పోర్టల్‌ను రూపొందించారు. రైతులకు కంటి మీద నిద్రలేకుండా చేసే చట్టం చేసింది. ధరణి అరాచకాల ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో చూశాము. అందుకే ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు ఉపయోగపడే పోర్టల్‌ను తీసుకొచ్చాం.
ధరణిని ప్రజలు ఆమోదించలేదు కాబట్టే దాన్ని పక్కన పడేశాం. కలెక్టర్ దగ్గర ఉండే అధికారాలను వికేంద్రీకరణ చేశాం. పలు రాష్ట్రాల్లో భూ చట్టాలను అధ్యయనం చేసి ఉత్తమ చట్టాన్ని రూపొందించాం. హరీశ్ రావు వంటి నేతల సూచనలు కూడా స్వీకరించాం. ముసాయిదాను మేధావులు, రైతుల ముందు కూడా పెట్టామన్నామని'' పొంగులేటి అన్నారు.