/rtv/media/media_files/2026/05/12/bandi-bhagirath-2026-05-12-13-40-41.jpg)
Bandi Bhagirath POCSO case
BIG BREAKING: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసులో దర్యాప్తు అత్యంత వేగంగా పుంజుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల అనంతరం ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసు పర్యవేక్షణాధికారిణిగా నియమితులైన కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేరుగా రంగంలోకి దిగారు. బాధితురాలు తొలుత ఇచ్చిన వాంగ్మూలం సమగ్రంగా లేదని గుర్తించిన డీసీపీ, మంగళవారం మధ్యాహ్నం స్వయంగా బాలిక నివాసానికి వెళ్లారు. దాదాపు రెండు గంటల పాటు బాధితురాలితో మాట్లాడి, భగీరథ్‌తో పరిచయం, అనంతరం జరిగిన లైంగిక వేధింపుల వివరాలపై ఆరా తీశారు. ఘటన తీవ్రతను బట్టి న్యాయమూర్తి ఎదుట కూడా వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
బాధితురాలి నుంచి సేకరించిన తాజా వివరాల ఆధారంగా పోలీసులు ఈ కేసులో మరింత కఠినమైన సెక్షన్లను జోడించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన తొలి ఫిర్యాదు మేరకు గత శుక్రవారం బీఎన్‌ఎస్ సెక్షన్లు 74, 75తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్‌విత్ 12 కింద పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, బాలికపై తీవ్రమైన లైంగిక దాడి జరిగిందన్న అభియోగాలతో ఇప్పుడు అదనంగా పోక్సో చట్టంలోని అత్యంత కఠినమైన సెక్షన్ 5(1) రెడ్‌విత్ 6ను చేర్చారు. ఆ తర్వాత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన దర్యాప్తు బృందం, నిందితుడికి నోటీసులు జారీ చేసింది. బుధవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
మరోవైపు, కేసు నమోదైనప్పటి నుంచీ భగీరథ్ పరారీలో ఉండటం, ఆయన ఫోన్ స్విచాఫ్ రావడం సంచలనంగా మారింది. భగీరథ్ ఫోన్ చివరి లొకేషన్ ఆధారంగా పోలీసులు కరీంనగర్‌లోని ఆయన మేనమామ, వైద్యుడు సీహెచ్ వంశీకృష్ణ నివాసానికి ఒక ఎస్‌ఐని పంపించారు. అక్కడ భగీరథ్ అందుబాటులో లేకపోవడంతో, విచారణకు హాజరుకావాలనే నోటీసు కాపీని ఆయన మేనమామకు అందజేశారు.
ఈ కేసులో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసిన నిర్దిష్ట తేదీల్లో ఏం జరిగిందనే అంశంపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. గతేడాది అక్టోబరు 25న నానక్‌రాంగూడలోని ఒక అపార్ట్‌మెంట్‌లో తన కుమార్తెను భగీరథ్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు రెండు మూడు రోజుల పాటు బలవంతంగా ఉంచారని తల్లి పేర్కొన్నారు. అలాగే నవంబరు 13న మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌స్టేలో, తిరిగి డిసెంబరు 31న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మరో ఫామ్‌హౌస్‌లో భగీరథ్ మద్యం (బ్రీజర్) తాగాలంటూ బలవంతం చేసి, అర్ధరాత్రి గదిలోకి వచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో వివరించారు. ఆయా సమయాల్లో అక్కడ ఉన్నట్లు చెప్తున్న ఇతర స్నేహితులు, అమ్మాయిలను కూడా గుర్తించి, వారి వాంగ్మూలాలను నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
Follow Us