/rtv/media/media_files/2025/05/05/4c0vNHFmJzaN6UKAiooX.jpg)
Telangana Police CM Revanth Reddy
TG Police Jobs: తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీంతో పలు పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మొత్తం 14,553 కానిస్టేబుళ్లతో పాటు ఎస్సై (SI) పోస్టులను భర్తీ చేసేందుకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ర్టంలో శాంతిభద్రతల పరిరక్షణను మరింత బలోపేతం చేయాలనే ఉద్ధేశంతో ఈ భారీ నియామక ప్రక్రియను చేపట్టినట్లు వెల్లడించింది. కాగా దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
కొత్త బెటాలియన్ల ఏర్పాటు.
కాగా, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ర్టంలో కొత్తగా పోలీస్ బెటాలియన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.వాటిలో కొత్తగా సంస్థాన్ నారాయణపూర్, ఆమన్‌గల్ ప్రాంతాల్లో స్పెషల్ పోలీస్ బెటాలియన్లను (Special Police Battalions) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కొత్త బెటాలియన్లకు అవసరమైన సిబ్బందిని కూడా తాజా నోటిఫికేషన్ ద్వారానే ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల గతంతో పోలిస్తే ఈసారి పోస్టుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పచ్చు. ఇది నిరుద్యోగ యువతకు మంచి అవకాశమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది.
గత కొంతకాలంగా ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు. నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఈ వార్త కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు. కాగా పోలీసు ఉద్యోగాల కోసం నిర్వహించే శారీరక దారుఢ్య పరీక్షలు, రాత పరీక్షల కోసం ఇప్పటికే నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. ఇక త్వరితగతిన ఉద్యోగాలను భర్తీ చేయాలనుకుంటున్న ప్రభుత్వం పారదర్శకమైన పద్ధతిలో, తక్కువ సమయంలోనే ఈ నియామక ప్రక్రియను పూర్తి చేయనుంది. జిల్లాల వారీగా ఖాళీలు, రిజర్వేషన్ల వివరాలను త్వరలోనే రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Follow Us