/rtv/media/media_files/2025/02/25/hRj0IxvPSdIXebH8tgbi.jpg)
Congress MLC Candidates
తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుత బలాబలాల ప్రకారం కాంగ్రెస్ కు 4, బీఆర్ఎస్ పార్టీకి 1కి వచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. అయితే ఐదో స్థానానికి అభ్యర్థిని దించి బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టాలన్నది సీఎం రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ సభ్యులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడితేనే కాంగ్రెస్ పార్టీ ఐదుకు ఐదు సీట్లు గెలిచే అవకాశం ఉంటేంది. అదే జరిగితే బీఆర్ఎస్ కు బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. మరో వైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని సీపీఐ కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెస్తోంది. మరో ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఓ నిర్ణయానికి రానుంది.
20 మందికి పైగా పోటీ..
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మందికి పైగా ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం పోటీ పడుతున్నారు. ఇందులో అద్దంకి దయాకర్ పేరు ముందు వరుసలో ఉంది. తనను చట్టసభకు పంపిస్తానని రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు. సీనియర్ నేతలు జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ తదితరులు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే.. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వకూడదని హైకమాండ్ నిబంధన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ముగ్గురికి అవకాశం కష్టమేనన్న ప్రచారం సాగుతోంది.
గత ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు మహబూబాబాద్ ఎమ్మెల్యే టికెట్ వదులుకున్న మరో సీనియర్ నేత బెల్లయ్య నాయక్ సైతం తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా పేరున్న పటేల్ రమేష్ రెడ్డి సైతం తనకు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ఆదేశాల మేరకు తాను సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకున్నానని గుర్తు చేస్తున్నారు. ఎంపీగా అవకాశం ఇస్తామని ఆ సమయంలో పార్టీ ఇచ్చిన హామీ అమలు కాలేదని.. ఇప్పుడు ఛాన్స్ ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నట్లు చర్చ సాగుతోంది. మరో వైపు బీసీ కోటాలో అంజన్ కుమార్ యాదవ్ కూడా గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.