/rtv/media/media_files/2025/04/01/rPXcT1HtlRZXuuLmC5Zx.jpg)
Prakash Raj Responds on HCU Land Issue
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)కి చెందిన 400 ఎకరాల భూములను విక్రయించేందుకు రేవంత్ ప్రభుత్వం వాటిని వేలం వేయనుండటంతో విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వర్సిటీ భూములను విక్రయించకూడదని డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలో రెవెన్యూ నెంబర్ 25 లోని 400 ఎకరాల భూమిపైనే ఈ వివాదం నడుస్తోంది. ఇప్పటికే దీనిపై విద్యార్థి సంఘాలతో పాటు బీఆర్ఎస్, టీడీపీ నాయకులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. వర్సిటీ భూములు విక్రయించకూడదని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: హెచ్‌సీయూను ముట్టడించిన విద్యార్థులు.. పరిస్థితి ఉద్రిక్తం
ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. '' ఈ విధ్వంసం ఆమోదించదగినది కాదు. ఇలాంటి దారుణమైన చర్యలను వ్యతిరేకిస్తున్న విద్యార్థులు, పౌరులకు మద్దతిస్తున్నాను. మన భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ పోరాటాన్ని బలోపేతం చేయండి. సేవ్ హెచ్‌సీయూ బయోడెవర్సిటీ అంటూ'' రాసుకొచ్చారు.
This distruction is not acceptable.. ఇది మంచిది కాదు .. i stand with the students and Citizens against such atrocious act .. 🙏🏿 request everyone to share and amplify this protest for our future #SaveHCUBioDiversity #OxygenNotAuction #SaveHCU#justasking pic.twitter.com/twlUVxoh68
— Prakash Raj (@prakashraaj) April 1, 2025
ఇదిలాఉండగా ఈ భూములకు హెచ్‌యూకి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ భూములు ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిందని వాదిస్తోంది. మరోవైపు విద్యార్థులు మాత్రం ఆ భూములు యూనివర్సిటీకే చెందుతాయని వాదిస్తున్నారు. హెచ్‌సీయూలో వర్సిటీ భూములను ఏదో ఒక సాకుతో ప్రభుత్వం వెనక్కి లాక్కుంటోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఏర్పడ్డాక దాదాపు 50 ఏళ్లలో 500 ఎకరాల భూమిని లాక్కున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. 2300 ఎకరాల్లో హెచ్‌సీయూను ఏర్పాటు చేయగా.. ఇప్పడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపణలు చేస్తున్నారు.
మళ్లీ ఇప్పుడు టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. అయితే ఈ స్థలం హెచ్‌సీయూది కాదని.. కోర్టు ఇచ్చిన తీర్పు మేరకే 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించినట్లు ప్రభుత్వం చెప్పింది. ఇది పూర్తయితే హెచ్‌సీయూలో ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే. HCU పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని.. హెచ్‌సీయూ భూములు వర్సిటీకే చెందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హెచ్‌సీయూ చుట్టూ ఐటీ కారిడర్ ఉండటం వల్ల ఈ భూములను విక్రయిస్తే భారీగా ఆదాయం వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 400 ఎకరాలను విక్రయిస్తే దీని మార్కెట్ విలువ ప్రకారం రూ.10 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
HCU Land Dispute | cm revanth | rtv-news