Pakistan : వివాదాస్పద రన్ అవుట్..  సల్మాన్ ఆఘాకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ!

ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా స్టేడియం వేదికగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఒక వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. పాక్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో స్టార్ బ్యాటర్ సల్మాన్ అలీ ఆఘా

New Update
pak

ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా స్టేడియం వేదికగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఒక వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. పాక్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో స్టార్ బ్యాటర్ సల్మాన్ అలీ ఆఘా (64) అనూహ్య రీతిలో రన్ అవుట్ అయ్యాడు. ఇప్పుడిది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

బంగ్లా కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ వేసిన బంతిని రిజ్వాన్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడగా, అది నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఆఘా ప్యాడ్లకు తగిలి ఆగింది. క్రీజు బయట ఉన్న ఆఘా.. క్రీజులోకి వెళ్లకుండానే ఆ బంతిని చేత్తో పట్టుకుని బౌలర్‌కు ఇవ్వబోయాడు. సరిగ్గా ఇదే సమయాన్ని వాడుకున్న మిరాజ్, వెంటనే బంతిని అందుకుని స్టంప్స్‌ను పడగొట్టి రన్ అవుట్ కోసం అప్పీల్ చేశాడు. థర్డ్ అంపైర్ కూడా నిబంధనల ప్రకారం ఇది అవుట్ అని తేల్చడంతో ఆఘా పెవిలియన్ చేరాల్సి వచ్చింది.

తీవ్ర అసహనం

ఈ అవుట్ పట్ల సల్మాన్ అలీ ఆఘా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న అతను, మైదానం వీడుతున్న సమయంలో తన గ్లౌస్‌లను విసిరికొట్టి ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. క్రికెట్ రూల్స్ ప్రకారం మైదానంలో క్రీడా పరికరాలను దుర్వినియోగం చేయడం నేరం కావడంతో, మ్యాచ్ రిఫరీ నీయాముర్ రషీద్ అతడిపై చర్యలు తీసుకున్నారు. ఆఘా ప్రవర్తనను తప్పుబడుతూ అతడికి మందలింపు ఇవ్వడంతో పాటు, ఒక డెమెరిట్ పాయింట్‌ను కూడా విధించారు. ఐసీసీతో చర్చించిన తర్వాతే తటస్థంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మ్యాచ్ రిఫరీ వెల్లడించారు.

ఇక ఈ రన్ అవుట్ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య చిన్నపాటి వాగ్వాదం కూడా జరిగింది. పాక్ కెప్టెన్ రిజ్వాన్ బంగ్లాదేశ్ ప్లేయర్లతో చర్చించగా, లిటన్ దాస్ తమ అప్పీల్‌ను సమర్థించుకున్నాడు. అయితే, ఇది కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిన చర్చగానే భావించిన రిఫరీ, ఆటగాళ్ల మధ్య జరిగిన మాటల యుద్ధంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం బ్యాట్‌ను లేదా గ్లౌస్‌లను విసిరేయడం వంటి క్రమశిక్షణా రాహిత్యానికి మాత్రమే ఆఘాకు జరిమానా పడింది. క్రికెట్ నిబంధనల ప్రకారం బంతి డెడ్ కాకముందే ఫీల్డర్ అనుమతి లేకుండా బ్యాటర్ ముట్టుకోకూడదు, అందుకే ఆఘా అవుట్ కావడం అనివార్యమైంది.

Advertisment
తాజా కథనాలు