/rtv/media/media_files/2026/06/13/rohit-2026-06-13-21-19-49.jpg)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన అద్భుతమైన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ తరఫున ఆడిన అత్యంత పెద్ద వయస్కుడైన క్రికెటర్‌గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించారు. శనివారం ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా ఆయన ఈ ఘనత సాధించారు. ఈ క్రమంలో 1983 ప్రపంచకప్ హీరో మోహిందర్ అమర్‌నాథ్ పేరిట ఉన్న దశాబ్దాల కాలం నాటి రికార్డును రోహిత్ బద్దలు కొట్టారు.
ఐపీఎల్ సమయంలో తగిలిన మోకాలి నరం గాయం కారణంగా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు కొంతకాలం దూరమయ్యారు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో జరిగిన ఫిట్‌నెస్ పరీక్షలో చివరి నిమిషంలో పాస్ కావడంతో ఆయన ఈ సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఇప్పటికే పూర్తి ఆధిక్యంలో ఉంది.
శనివారం నాటి మ్యాచ్ బరిలోకి దిగే సమయానికి రోహిత్ శర్మ వయసు 39 సంవత్సరాల 44 రోజులు. కాగా, గతంలో ఈ రికార్డు మోహిందర్ అమర్‌నాథ్ పేరిట ఉండేది. అమర్‌నాథ్ అక్టోబర్ 30, 1989న ముంబైలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌తో తన చివరి వన్డే మ్యాచ్ ఆడినప్పుడు ఆయన వయసు 39 సంవత్సరాల 36 రోజులు. ఇప్పుడు రోహిత్ ఆ రికార్డును అధిగమించారు.
11,000 కంటే ఎక్కువ పరుగులు
రోహిత్ శర్మ వన్డే కెరీర్‌లో ఇదొక అద్భుతమైన మైలురాయి. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో ఒకరైన రోహిత్... ఇప్పటివరకు వన్డేల్లో 11,000 కంటే ఎక్కువ పరుగులు, అన్ని ఫార్మాట్లు కలిపి 20,000 కంటే ఎక్కువ అంతర్జాతీయ పరుగులు సాధించారు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆయన మూడో స్థానంలో ఉన్నారు.
భారత్ తరఫున రోహిత్ శర్మ ఈ రికార్డు సాధించినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా వన్డే మ్యాచ్ ఆడిన అత్యంత పెద్ద వయస్కుడైన ఆటగాడిగా నెదర్లాండ్స్‌కు చెందిన నోలన్ క్లార్క్ రికార్డులో ఉన్నారు. ఆయన 1996లో రావల్పిండిలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడినప్పుడు ఆయన వయసు 47 సంవత్సరాల 257 రోజులు.
ప్రస్తుత అఫ్గానిస్తాన్ సిరీస్‌లో రోహిత్ శర్మకు మరో రికార్డు అందుకునే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో గనుక ఆయన ఒక సెంచరీ చేస్తే... వన్డేల్లో సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడైన భారత బ్యాటర్‌గా నిలుస్తారు. ప్రస్తుతం ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 2012లో బంగ్లాదేశ్‌పై తన చివరి వన్డే సెంచరీ చేసినప్పుడు ఆయన వయసు 38 సంవత్సరాల 327 రోజులు.
Follow Us