/rtv/media/media_files/2026/05/29/rishab-pant-2026-05-29-20-51-34.jpg)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే క్రికెట్ వర్గాల్లో ఒక షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. లక్నో సూపర్ జాయింట్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుండి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. కెప్టెన్సీ బాధ్యతల నుండి తనను తప్పించాలని పంత్ స్వయంగా కోరాడని, ఆ అభ్యర్థనను తాము గౌరవిస్తూ తక్షణమే ఆమోదించామని లక్నో టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది.
అయితే, ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. పంత్ నిజంగానే స్వచ్ఛందంగా తప్పుకున్నాడా? లేక లక్నో యాజమాన్యమే అతనిపై ఒత్తిడి తెచ్చి కెప్టెన్సీ నుంచి తీసేసిందా? అనే చర్చ విపరీతంగా నడుస్తోంది. కెప్టెన్సీ భారం దిగిపోవడంతో పంత్ ఇకపై తన బ్యాటింగ్‌పై పూర్తి దృష్టి పెట్టవచ్చని కొందరు అంటుంటే.. వరుసగా రెండు సీజన్లలో జట్టు అట్టడుగున నిలవడంతోనే మేనేజ్‌మెంట్ అతనిపై వేటు వేసిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
రూ. 27 కోట్ల రికార్డు ధర
గతేడాది జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జాయింట్స్ జట్టు రిషభ్ పంత్‌ను ఏకంగా రూ. 27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసి, జట్టు పగ్గాలను అప్పగించింది. కానీ, కెప్టెన్‌గా పంత్ అరంగేట్రం అస్సలు బాగాలేదు. 2025 సీజన్లో లక్నో ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 6 మాత్రమే గెలిచింది. పంత్ కూడా బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమై 13 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 269 పరుగులే చేశాడు.
జట్టు ప్లేఆఫ్స్‌కు చేరనప్పటికీ, లక్నో యాజమాన్యం పంత్‌పై నమ్మకంతో ఈ ఐపీఎల్ 2026 సీజన్‌కు కూడా కెప్టెన్‌గానే కొనసాగించింది. కానీ ఈసారి పరిస్థితి మరింత దిగజారింది. ఈ 2026 సీజన్లో లక్నో జట్టు పంత్ నాయకత్వంలో 14 మ్యాచ్‌లకు గాను కేవలం 4 మ్యాచులు మాత్రమే గెలిచింది. పంత్ బ్యాట్‌తో 312 పరుగులు చేసినప్పటికీ, జట్టును ముందుకు నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఈ వరుస పరాజయాల నేపథ్యంలోనే పంత్ లక్నో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పడం ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Follow Us