/rtv/media/media_files/2026/02/28/pakistan-cricket-2026-02-28-16-28-39.jpg)
pakistan cricket
ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ అత్యంత రసవత్తరంగా జరుగుతోంది. అయితే ఈ టోర్నీలో పాకిస్తాన్ జట్టు పేవలమైన ప్రదర్శన ఆ దేశ క్రికెట్ బోర్డులో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ జట్టు ఆటతీరుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అసంతృప్తితో పాటు ఫుల్ ఫైర్‌మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచ కప్ టోర్నీ ముగిసిన వెంటనే జట్టులో భారీ మార్పులు చేర్పులు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
pakistan cricket
ముఖ్యంగా పాకిస్తాన్ కెప్టెన్‌గా ఉన్న సల్మాన్ అలీ ఆగా నాయకత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జట్టును అతడు నడిపించే తీరుపై బోర్డు సంతృప్తిగా లేదని తెలుస్తోంది. ఒకవైపు ప్రపంచకప్ టోర్నీలో తమ జట్టు అద్భుతంగా ఆడుతుందని సెలెక్టర్లు, కోచ్‌లు ఛైర్మన్ నఖ్వీని నమ్మబలికారని.. తీరా జట్టు ప్రదర్శన అతి దారుణంగా ఉండటంతో ఆయన చాలా కోపంగా ఉన్నట్లు సమాచారం. అందువల్ల కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాను ఆ పదవి నుంచి తప్పించాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో షాదాబ్ ఖాన్ లేదా షహీన్ అఫ్రిదికి జట్టు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే మరోవైపు పాకిస్తాన్ సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్ వంటి ప్లేయర్ల టీ20 కెరీర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినట్లు సమాచారం. ఇకపై వారిని పక్కన పెట్టాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆధునిక క్రికెట్ వేగానికి తగ్గట్టుగా బాబర్ ఆడలేకపోతున్నారని కోచ్ మైక్ హెసన్ భావిస్తున్నట్లు సమాచారం. అందువల్ల వారి స్థానంలో యువ ప్లేయర్లను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. రాబోయే మ్యాచ్‌ల్లో బాబర్ ఏదైనా అద్భుతం చేస్తే తప్ప.. ఆయన టీ20 కెరీర్ ముగిసినట్లేనని పాక్ క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ల ప్రదర్శన మారకపోతే వారి కెరీర్‌కు చెక్ పెట్టాలని, భవిష్యత్ అవసరాల కోసం కొత్త ప్లేయర్లను తీసుకునేందుకు బోర్డు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. . .
Follow Us