/rtv/media/media_files/2026/02/07/rohit-2026-02-07-15-17-40.jpg)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్ కోసం ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను సమూలంగా మార్చేసింది. ఇప్పటివరకు ఉన్న అత్యున్నత కేటగిరీ గ్రేడ్ A+ను బోర్డు పూర్తిగా రద్దు చేసింది. దీని ప్రభావం టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై పడింది.
సాధారణంగా అన్ని ఫార్మాట్లు (టెస్టులు, వన్డేలు, టీ20లు) ఆడే ఆటగాళ్లకు మాత్రమే బీసీసీఐ గతంలో టాప్ గ్రేడ్ ఇచ్చేది. అయితే, కోహ్లీ, రోహిత్ ఇప్పటికే టీ20లు, టెస్టుల నుంచి తప్పుకుని ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో, వారు కేవలం ఒకే ఫార్మాట్ ఆడుతున్నందున, వారిని గ్రేడ్-బికి తగ్గిస్తూ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
గతంలో ఉన్న నాలుగు గ్రేడ్ల స్థానంలో ఇప్పుడు కేవలం మూడు (A, B, C) గ్రేడ్లు మాత్రమే ఉన్నాయి.
గ్రేడ్ A: ఈ అత్యున్నత జాబితాలో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.
గ్రేడ్ B: ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వంటి 11 మంది ఆటగాళ్లు ఉన్నారు.
గ్రేడ్ C: అక్షర్ పటేల్, రింకూ సింగ్, సంజు శాంసన్, తిలక్ వర్మ కొత్త కుర్రాళ్ళు అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి వంటి 16 మందికి ఈ గ్రేడ్ దక్కింది.
రూ. 7 కోట్ల వార్షిక వేతనం
బీసీసీఐ వారసత్వం కంటే.. ప్రస్తుతం ఆటగాడు ఎన్ని ఫార్మాట్లలో అందుబాటులో ఉన్నాడు, జట్టుకు ఎంతవరకు తోడ్పడుతున్నాడు అనే అంశాలకే ప్రాధాన్యత ఇస్తోంది. కాగా గతేడాది గ్రేడ్ A+ లో ఉన్న వారికి రూ. 7 కోట్ల వార్షిక వేతనం ఉండేది. ఇప్పుడు ఆ కేటగిరీ రద్దు కావడంతో, గ్రేడ్-బికి పడిపోయిన సీనియర్ల ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
Follow Us