కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన కులసమీకరణాలు.. ఆ వ్యూహంతో బీజేపీ సక్సెస్!

హర్యానాలో కులసమీకరణాలే కాంగ్రెస్‌ను దెబ్బకొట్టినట్లు తెలుస్తోంది. 24 శాతం ఉన్న జాట్ సామాజికవర్గం కాంగ్రెస్‌కు మద్ధతుగా నిలవగా.. జాటేతర ఓటర్లను బీజేపీ తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. ఫలితంగా మూడోసారి బీజేపీ అధికారం చేపట్టనుంది.

New Update

Haryana Assembly Elections: దేశంలో అత్యంత ఉత్కంఠ రేపిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అంచనాలు తారుమారయ్యాయి. మెజార్టీ పోల్ సర్వేలు కాంగ్రెస్ విజయం తధ్యం అని చెప్పినప్పటికీ.. అనూహ్యంగా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకే స్థానిక ప్రజలు పట్టం కట్టారు. అయితే కాంగ్రెస్ ఓటమికి కుల సమీకరణాలే కారణంగా తెలుస్తోంది. జాట్ సామాజికవర్గానికి కాంగ్రెస్ పెద్దపీట వేయడమే దెబ్బకొట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

28 స్థానాల్లో జాట్లకు టికెట్..

ఈ మేరకు ఎన్నికల్లో విజయం ఖాయమేననే ధీమాతో ఉన్న కాంగ్రెస్ జాట్‌, దళిత్‌, మైనార్టీ ఓట్లపై ఆశలు పెట్టుకుంది. హర్యానాలో 24 శాతం జాట్ సామాజికవర్గం జనాభా ఉండగా వారిలో బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. దానిని అనుకూలంగా మార్చుకున్న కాంగ్రెస్ 28 స్థానాల్లో జాట్లకు టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నాన్‌ - జాట్‌, నాన్ - మైనార్టీ ఓటర్లను బీజేపీ తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. 

జాట్ ఓట్లను చీల్చిన INLD..

జాటేతర ఓటర్లను ఏకం చేయడంలో బీజేపీ సక్సెస్ కాగా.. జాట్ ఓట్లను INLD చీల్చడంతో కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. తూర్పు, దక్షిణ హర్యానా లాంటి నాన్‌ - జాట్ ఏరియాల్లో బీజేపీ తన బలాన్ని నిలుపుకుంది. జాట్‌ మెజార్టీ ఉన్న ఏరియాల్లో నాన్ - జాట్‌ ఓట్లు సాధించింది. 16 స్థానాల్లో జాట్‌ సామాజికవర్గానికి బీజేపీ టికెట్ కేటాయించగా.. ప్రస్తుత సీఎం నాయబ్ సింగ్ సైనీ ఓబీసీ కమ్యూనిటీకి చెందినవాడు కావడంతో తన సామాజిక వర్గం ఓట్లన్నీ తనకే పడ్డాయి. అంతేకాదు ఆయననే మరోసారి సీఎంగా బీజేపీ ప్రచారం చేయడంకూడా కలిసొచ్చింది. 8 శాతం ఉన్న బ్రాహ్మణ సామాజికవర్గానికి పార్టీ చీఫ్ పదవి ఇచ్చిన బీజేపీ.. ఇదే అదనుగా బ్రహ్మణ ఓట్లన్నీ లాగేసుకుంది. పదేళ్ల క్రితం 2014లోనూ హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా బీజేపీ అధికారం చేపట్టింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు