/rtv/media/media_files/2026/04/17/women-reservation-bill-controversy-2026-04-17-17-26-31.jpg)
Women Reservation Bill Controversy
లోక్‌సభలో కేంద్రం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఓటింగ్‌లో 528 మంది ఎంపీలు పాల్గొనగా అనుకూలంగా 298 ఓట్లు రాగా వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. బిల్లు వీగిపోవడంతో డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులు కూడా కేంద్రం వెనక్కి తీసుకుంది. ఫలితంగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలుకు బ్రేక్ పడింది. అయితే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని కేంద్రం ప్రతిపాదించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ పలు కారణాల వల్ల ఇది అమలు కాలేకపోయింది.
మొదటిసారిగా దేవెగౌడ ప్రభుత్వం 1996లో 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీన్ని ప్రవేశపెట్టింది. కానీ ఆ సమయంలో లోక్‌సభ రద్దు కావడంతో ఆ బిల్లు నిలిచిపోయింది. ఆ తర్వాత అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కూడా పలుమార్లు ఈ బిల్లును ప్రవేశపెట్టారు.1998, 1999, 2002 , 2003.. ఏకంగా నాలుగుసార్లు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.కానీ ఆ సమయంలో బిల్లు ప్రతిప్రతులను చింపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చివరికి మిత్రపక్షాల సపోర్ట్ లభించక ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయి.
Also Read: రాహుల్ గాంధీకి బిగ్ షాక్: ఎఫ్ఐఆర్ నమోదు!
ఇక UPA హయాంలో 2010లో రాజ్యసభ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. కానీ లోక్‌సభలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ లాంటి పలు విపక్ష పార్టీలు ఈ రిజర్వేషన్‌లో ఓబీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ ఉండాలని పట్టుబట్టాయి. దీంతో రాజకీయ ఏకాభిప్రాయం కుదరక లోక్‌సభలో ఓటింగ్ జరగలేదు. ఆ తర్వాత 2014లో లోక్‌సభ రద్దు కావడంతో ఆ బిల్లు ఆగిపోయింది. ఇలా దశాబ్దాల పాటు కేవలం పార్టీల మేనిఫెస్టోలకే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు పరిమితమైంది.
చివరికి మోదీ ప్రభుత్వం 2023 సెప్టెంబర్‌లో ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును మళ్లీ ప్రవేశపెట్టింది. లోక్‌సభ, రాజ్యసభలు భారీ మెజార్టీతో దీన్ని ఆమోదించాయి. కానీ ఈ రిజర్వేషన్లు అమలు కావాలంటే డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియ జరగాలని చట్టంలో పేర్కొన్నారు. అంటే 2026 తర్వాత జరిగే 'జన గణన' వరకు ఆగాలి. కానీ కేంద్ర ప్రభుత్వం131వ సవరణ ద్వారా ఆ నిబంధనను మార్చేసింది. కొత్త జనాభా లెక్కల కోసం వేచి చూడాల్సిన పని లేకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ జరిపి.. 2029 ఎన్నికల నాటికే మహిళా రిజర్వేషన్లు ఇచ్చేలా దీన్ని రూపొందించారు.
Follow Us