/rtv/media/media_files/2026/06/10/amaravati-2026-06-10-15-58-59.jpg)
Amaravati
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన ముందడుగు వేసింది. అమరావతిలో భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సంబంధించి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD) పంపిన ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ బుధవారం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి.. సుమారు రూ.2,534 కోట్ల అంచనా వ్యయంతో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజధాని నిర్మాణంలో మైలురాయిగా నిలవనుంది.
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఈ ప్రాజెక్టులలో మొదటిది ‘కామన్ సెంట్రల్ సెక్రటేరియట్’ (కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్). అమరావతి వేదికగా కార్యకలాపాలు సాగించే వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల విభాగాలన్నీ ఒకే చోట కొలువుదీరేలా ఈ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. దీని కోసం కేంద్ర కేబినెట్ రూ.1,299.08 కోట్లు కేటాయించింది. స్మార్ట్ సిటీ రూపకల్పనలో భాగంగా పూర్తి ఆధునిక వసతులతో నిర్మించే ఈ భారీ కాంప్లెక్స్ ద్వారా రాష్ట్రంలో కేంద్ర నిధుల నిర్వహణ, వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం మరింత సులభతరం కానుందని అధికారులు భావిస్తున్నారు.
ఇక రెండో ప్రాజెక్టు కింద, అమరావతి కేంద్రంగా పనిచేసే కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల వసతి కోసం భారీ నివాస సముదాయాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.1,234.91 కోట్ల వ్యయాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నిధులతో ఉద్యోగుల కొరకు అత్యాధునిక మల్టీస్టోరేజ్ (బహుళ అంతస్తుల) గృహ సముదాయాలను నిర్మిస్తారు. రాజధాని ప్రాంతంలో కేంద్ర ఉద్యోగులకు అత్యుత్తమ, సౌకర్యవంతమైన నివాస వసతి కల్పించడం ద్వారా వారు మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని అధికారులు వెల్లడించారు.
ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూమిని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) ఇప్పటికే కేటాయించింది. మొత్తం 22.53 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు జరగనున్నాయి. ఇందులో 5.53 ఎకరాల స్థలాన్ని (కొన్ని నివేదికల ప్రకారం 5.35 ఎకరాలు) సెంట్రల్ సెక్రటేరియట్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఉపయోగించనుండగా.. మిగిలిన 17 ఎకరాల విస్తారమైన స్థలాన్ని కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయ ప్రాజెక్టు కోసం కేటాయించారు.
కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఈ తాజా నిర్ణయం అమరావతి నగర రూపురేఖలను మార్చడమే కాకుండా, రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగానికి సరికొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మేజర్ కార్యాలయాలు, నివాసాలు ఇక్కడికి రావడం ద్వారా అమరావతికి జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించనుంది. ప్రస్తుతం భూమి కేటాయింపులు, నిధుల మంజూరు ప్రక్రియ పూర్తయినందున, త్వరలోనే ఈ నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
Follow Us