ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ తన ఛానల్‌లోఓ సంచలన వీడియో అప్‌లోడ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఓ డాక్యమెంటరీని విడుదల చేశారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో ఆప్‌కు చెందిన డాక్యుమెంటరీ ప్రదర్శనను పోలీసులు ఇటీవలే నిలిపివేశారు. దీంతో ధ్రువ్ రాఠీ తన యూట్యూబ్‌లో ఈ వీడియో రిలీజ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఆ వీడియోలో చాలా విషయాలు ఉన్నాయి.
వీడియోలో ఏముంది ?
ఈ డాక్యుమెంటరీ పేరు అన్‌బ్రేకబుల్. ఆదివారం రాత్రి ధ్రువ్ రాఠీ దీన్ని పోస్ట్ చేశారు. ఈ వీడియోను నిషేధించకముందే చూడండనే టైటిల్ కూడా ఇచ్చారు. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అతిషి, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వంటి కీలక నేతల ఇంటర్వ్యూలు ఉన్నాయి. లిక్కర్ కేసులో సత్యేందర్ జైన్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ, ఈడీలు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొంతకాలం తర్వాత వీళ్లందరూ బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. అరెస్టుకు ముందు.. అరెస్టు తర్వాత పార్టీలో ఎలాంటి మార్పులు వచ్చాయన్న విషయాలు వివరిస్తూ ఈ డాక్యుమెంటరీని తయారుచేశారు. ఇందులో కనిపించిన నేతలు.. తమపై కావాలనే కుట్ర చేశారని.. బీజేపీపై, ప్రధాని మోదీపై తీవ్రంగా విమర్శలు చేశారు.
డాక్యుమెంటరీ వివాదం
ఎన్నికల గైడ్‌లైన్స్‌ను పాటించలేదనే కారణంతో ఢిల్లీ పోలీసులు ఆప్ రూపొందించిన అన్‌బ్రేకబుల్ డాక్యుమెంటరీ ప్రదర్శనను నిలిపివేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో సింగిల్ విండో వ్యవస్థ ద్వారా పర్మిషన్ కోసం పార్టీలు దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల తాము ఇలాంటి పర్మిషన్ ఇవ్వలేమని పేర్కొన్నారు. మరోవైపు ఈ డాక్యుమెంటరీ ఎన్నికల ప్రచారం కాదని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎన్నికలతో దీనికి సంబంధం లేదని.. ఇందులో ఏ పార్టీ గుర్తు, జెండా లేదని చెప్పారు. దాన్ని నిలిపివేయడం నియంతృత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఇది ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఛానల్‌లో రావడం ప్రాధాన్యం సంతరించకుంది. ఆ వీడియోకి ఇప్పటివరకు 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇదిలాఉండగా.. ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు విడుదల కానున్నాయి.