/rtv/media/media_files/2026/05/19/ebola-virus-2026-05-19-17-43-41.jpg)
Uganda Woman Ebola Symptoms
Ebola Virus : ఆఫ్రికా దేశాలలో ఎబోలా వైరస్ (Ebola Virus) మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉగాండాకు చెందిన 28 ఏళ్ల మహిళలో ఎబోలా లక్షణాలు కనిపించడం కలకలం రేపింది. ఆ మహిళ ఈ నెల 23న ఆమె ఉగాండా నుంచి అహ్మదాబాద్ మీదుగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో అధికారులు ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తుండగా, సదరు మహిళలో ఒళ్లునొప్పులు, తీవ్ర అలసట వంటి తేలికపాటి లక్షణాలను ఎయిర్‌పోర్టు వైద్య సిబ్బంది గుర్తించారు.
ముందుజాగ్రత్త చర్యగా అధికారులు ఆమెను వెంటనే బెంగళూరు ఇందిరానగర్‌లోని ప్రభుత్వ అంటువ్యాధుల ఆస్పత్రికి తరలించి, ప్రత్యేకంగా ఐసోలేట్ చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యాధికారుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని కర్ణాటక ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిత్విక్ రంజన్‌పాండే తెలిపారు. అయితే, ఆమెలో కనిపించిన లక్షణాలు ఖచ్చితంగా ఎబోలాకు సంబంధించినవేనా.. కాదా అనే విషయంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని ఆయన పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణ కోసం సేకరించిన మహిళ రక్త నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపించగా, మరో రెండు రోజుల్లో ఈ పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి.
ఈ ఘటనపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ప్రస్తుతం భారతదేశంలో ఎలాంటి ఎబోలా వైరస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి తీవ్రతరం కావడంతో భారత ప్రభుత్వం అక్కడి పరిస్థితులను, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలను చాలా నిశితంగా పర్యవేక్షిస్తోందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటనలో హామీ ఇచ్చింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో నిఘా, స్క్రీనింగ్ ప్రక్రియను మరింత బలోపేతం చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
మరోవైపు ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తిపై ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్న తరుణంలో రష్యా ఒక కీలక ప్రకటన చేసింది. ఎబోలా రకాల్లో ఒకటైన 'బుండిబుగ్యో ఎబోలా' (Bundibugyo Ebola) స్ట్రెయిన్ నుంచి రక్షణ కల్పించే కొత్త వ్యాక్సిన్‌ను తమ శాస్త్రవేత్తలు విజయవంతంగా కనుగొన్నట్లు రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మురాష్కో వెల్లడించారు. ఈ మేరకు దక్షిణాఫ్రికాలోని రష్యా దౌత్యకార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్ (X) ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త వ్యాక్సిన్ ఆఫ్రికా దేశాలలో ఎబోలా కట్టడికి ఎంతో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Follow Us