/rtv/media/media_files/2026/05/07/tvk-vijay-2026-05-07-20-36-52.jpg)
TVK Vijay
రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా చూశారా? అందులో "లెక్కేసి కొడితే ఐదేళ్లలో సీఎం కుర్చీ నా ముడ్డి కింద ఉండాలి" అనే డైలాగ్ విన్నారా ?. కానీ ఐదేళ్లు పట్టలే.. రెండు సంవత్సరాల్లోనే లెక్కేసి కొట్టాడు టీవీకే చీఫ్ విజయ్. మే 4న ఆయన వేసిన విజిల్ సౌండ్‌కు తమిళనాడు దద్దరిల్లింది. 234 నియోజకవర్గాల్లో 108 చోట్ల గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే రికార్డు సృష్టించింది. ఏప్రిల్ 16న విజయ్ ఏం చెప్పాడు? తమిళులు టీవీకేని ఎందుకు అంత స్ట్రాంగ్‌గా నమ్మారు? ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
5కోట్ల 73లక్షల మంది ఓటర్లు. అందులో 2.80 కోట్ల మంది పురుషులు, 2.93 కోట్ల మంది మహిళలు.. ఫస్ట్ టైం ఓటు వేసేవాళ్లు 14.6లక్షల మంది యువత. ట్రాన్స్‌జెండర్లు 7, 700 మంది. అయితే విజన్ క్లియర్‌గా ఉంటే.. టార్గెట్ ఫిక్స్ చేసుకోవచ్చు. విజయ్ విజన్ సీఎం సీటు.. టార్గెట్ యూత్, మహిళా ఓటర్లు. ఈ రెండీటిని ఒకే ట్రాక్‌పై సెట్ చేయడానికి ఓ పేపర్ తీసుకొచ్చాడు.. అదే TVK మేనిఫెస్టో.. తమిళ్ రాజకీయాల తలరాత మార్చడానికి, అతను అనుకున్నది చేయడానికి అది బాగా ఉపయోగపడింది. విజయ్ హామీలకు 35% ఓటర్లు అంటే దాదాపు 1.72 కోట్ల మంది ఓటర్లు TVK కి ఓటు వేశారు.
మేనిఫెస్టో ప్రకటించినప్పుడు ఆయన అన్న మాటలు మనకు కొత్తగా అనిపిస్తాయి. ఈ కాగితం తిరువళ్లువర్ రచించిన తమిళ గ్రంథం తిరుక్కురళ్‌లోని ఆరం, పొరుళ్, ఇన్‌బం సూత్రాల ఆధారంగా రూపొందించామన్నారు. 2000 ఏళ్ల నాటి తమిళ నైతిక గ్రంథం 'తిరుక్కురళ్'లో ఆరం అంటే ధర్మం, పొరుళ్ అంటే సంపద, ఇన్‌బం అంటే ఆనందం అనే సూత్రాలను తన పాలనా విధానానికి దిక్సూచిగా ఎంచుకున్నారు. అంటే నీతివంతమైన సంపాదన, ఆ సంపదతో ప్రజలందరికీ సుఖశాంతులు చేకూర్చడమే ఆయన లక్ష్యం. ఇవే రాష్ట్రంలో పరిపాలన, రాజకీయాలకు అవసరమైన గుణాలని ఆయన చెప్పుకొచ్చారు. విజయ్ ఫోకస్ అంతా యువత, మహిళలు, అట్టడుగు వర్గాలపైనే. తాను ఎవరికీ వ్యతిరేకం కాదు, అందరికీ అనుకూలం అనే తరహాలో ఆయన ప్రసంగాలు సాగాయి. మతం, కులం పేరుతో జరిగే రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు విజయ్ స్పష్టం చేశారు. పేరియార్, అంబేడ్కర్, కామరాజర్ లాంటి మహనీయుల ఆశయాలే తన పార్టీకి పునాదులని ఆయన ప్రకటించుకున్నారు.
తమిళగ వెట్రి కళగం పార్టీ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన మేనిఫెస్టోలో సంక్షేమం, అభివృద్ధి, సాంకేతికతకు ప్రాధాన్యతనిస్తూ పలు కీలక హామీలను పొందుపరిచింది. సామాజిక న్యాయం, లౌకికవాదమే లక్ష్యంగా ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు ఆయన ప్రకటించారు.
మహిళా కోసం..
కుటుంబ యజమానురాలైన ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం.
ప్రతి కుటుంబానికి ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.
పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం 8 గ్రాముల బంగారంతోపాటు ఓ పట్టుచీర గిఫ్ట్.
గవర్నమెంట్ హాస్పిటల్‌లో పుట్టిన పిల్లలకు బేబీ వెల్‌కమ్ కిట్‌తోపాటు బంగారు ఉంగరం
మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం
యూత్ కోసం..
5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, 5 లక్షల మందికి స్టైపెండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌లు.
గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.4,000, డిప్లొమా హోల్డర్లకు రూ.2,500.
ఇంటర్ నుంచి పీహెచ్‌డీ వరకు విద్యార్థులకు రూ.20 లక్షల వరకు షూరిటీ లేని లోన్స్.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల తల్లులకు ఏటా రూ.15,000 ఆర్థిక సాయం.
రైతులు కోసం..
5 ఎకరాలలోపు ఉన్న రైతులకు పూర్తి రుణమాఫీ, అంతకంటే ఎక్కువ ఉన్నవారికి 50% రుణమాఫీ.
వరికి క్వింటాల్‌కు రూ.3,500, చెరకు టన్నుకు రూ.4,500 కనీస మద్దతు ధర.
కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.10,000 పెట్టుబడి సాయం.
అడ్మినిష్ట్రేషన్ అండ్ టెక్నాలజీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం స్పెషల్ మినిస్ట్రీ, అలాగే AI యూనివర్సిటీ, AI సిటీ ఏర్పాటు.
వనరుల సమాన పంపిణీ కోసం రాష్ట్రంలో కులాధారిత సర్వే.
ప్రభుత్వ సేవలను నిర్ణీత గడువులోగా అందించడానికి 'రైట్ టు సర్వీస్ యాక్ట్'తో అవినీతి రహిత పాలన.
వైద్యం..
ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత IVF ట్రీట్‌మెంట్.
పోలీసుల కనీస వేతనం రూ.25,000 కు పెంపు.
చేనేత కార్మికులకు 500 యూనిట్లు, పవర్‌లూమ్ కార్మికులకు 1,500 యూనిట్ల ఉచిత విద్యుత్.
తమిళనాడుకి ఇప్పటి వరకు రూ.10 లక్షల కోట్లు అప్పు ఉంది. విజయ్ TVK ప్రకటించిన మేనిఫెస్టో సామాజిక సంక్షేమంతోపాటు అభివృద్ధి కలయికగా ఉంది. ఇందులో కొన్ని పథకాలు అమలు చేయడానికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపే అవకాశం ఉంది.
అమలు చేయడానికి సాధ్యమయ్యే పథకాలు
గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల తల్లులకు రూ.15,000 ఏడాదికి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మంత్రిత్వ శాఖ
మహిళా స్వయం సహాయక బృందాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
చెన్నై మిషన్
200 యూనిట్ల ఉచిత విద్యుత్
ఆర్థిక భారం పడే పథకాలు
మహిళలకు నెలకు ₹2,500 సాయం
వరికి 3,500, చెరకుకు 4,500 మద్దతు ధర
వ్యవసాయ రుణాల మాఫీ
నలుగు వేల నిరుద్యోగ భృతి
పేదింటి యువతులకు మ్యారేజ్ గిఫ్ట్
ఈ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేయాలంటే రాష్ట్రం ఇంకా అప్పు చేయాలి. లేదా కొత్త పన్నులు వేయాల్సి ఉంటుంది. ఈ పథకాలకు కావాల్సిన నిధులను ఎక్కడి నుంచి తెస్తారో టీవీకే మేనిఫెస్టోలో స్పష్టంగా లేదు. మద్యం అమ్మకాలు ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించాలని TVK భావిస్తే, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. విజయ్ టీవీకే పార్టీ ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తారా ? లేదా ? తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే.
Follow Us