/rtv/media/media_files/2026/05/09/vijay-tvk-2026-05-09-06-28-48.jpg)
తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి, ఏఎమ్‌ఎమ్‌కే (AMMK) జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ మధ్య పెద్ద గొడవే మొదలైంది. తమ ఎమ్మెల్యే ఇచ్చిన మద్దతు లేఖ నకిలీది అని దినకరన్ అంటుంటే, అందులో అస్సలు నిజం లేదని విజయ్ పార్టీ (TVK) గట్టిగా తిప్పికొట్టింది.
అసలు ఏం జరిగింది అంటే..
విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమ మద్దతు ఉంటుందని చెబుతూ.. ఏఎమ్‌ఎమ్‌కే పార్టీకి చెందిన ఎమ్మెల్యే కామరాజ్ ఒక లేఖ రాశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే, ఈ లేఖ చూసి షాక్ తిన్న ఏఎమ్‌ఎమ్‌కే చీఫ్ టీటీవీ దినకరన్.. వెంటనే శుక్రవారం రోజున గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలవడానికి రాజ్‌భవన్‌కు పరుగులు తీశారు. విజయ్ పార్టీకి తమ ఎమ్మెల్యే కామరాజ్ మద్దతు ఇస్తున్నట్టు వచ్చిన లేఖ పూర్తిగా నకిలీదని ఇందులో ఏదో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర దాగి ఉందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ ఎప్పటికీ ఎన్డీయే (NDA), ఏఐఏడీఎమ్‌కే (AIADMK) కూటమికే కట్టుబడి ఉంటారని దినకరన్ స్పష్టం చేశారు. అలాగే, ఏఐఏడీఎమ్‌కే అధినేత ఎడప్పాడి కె. పళనిస్వామి (EPS) ముఖ్యమంత్రి కావడానికి తాము మద్దతు ఇస్తున్నట్లు లేఖ కూడా ఇచ్చారు.
#WATCH | TVK shares a video of AMMK MLA Kamaraj, saying "These are the video visuals of AMMK MLA Kamaraj voluntarily and happily writing a letter expressing his support for the Tamilaga Vettri Kazhagam. He had stated that he was extending support to the Tamilaga Vettri Kazhagam… pic.twitter.com/sM3xtyXx12
— ANI (@ANI) May 8, 2026
దినకరన్ చేసిన ఆరోపణలను విజయ్ పార్టీ పూర్తిగా కొట్టిపారేసింది. దినకరన్ అబద్ధాలు చెప్తూ నిజాలను దాస్తున్నారని ఆరోపించింది. దీనికి రుజువుగా ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఆ వీడియోలో ఏఎమ్‌ఎమ్‌కే ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా, ఎంతో సంతోషంగా విజయ్ పార్టీకి మద్దతు ఇస్తూ లేఖ రాస్తున్నట్లు కనిపిస్తోంది. తన పార్టీ బాస్ టీటీవీ దినకరన్ అనుమతితోనే తాను విజయ్‌కు మద్దతు ఇస్తున్నానని కూడా కామరాజ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
"కామరాజ్ స్వయంగా రాసిన లేఖను ఇప్పుడు రాయలేదని చెప్పడం పచ్చి అబద్ధం. ప్రజలందరూ ఈ నిజాన్ని గ్రహించాలి. దినకరన్ కావాలనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాకు ఎవరితోనూ బేరసారాలు ఆడాల్సిన అవసరం అస్సలు లేదు."
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 సీట్లు (మెజారిటీ మార్క్) కావాలి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఒంటరిగానే పోటీ చేసి 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మెజారిటీకి కేవలం 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో తమిళనాడులో దశాబ్దాలుగా సాగుతున్న డీఎమ్‌కే, ఏఐఏడీఎమ్‌కేల హవాకు చెక్ పెడుతూ.. విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం రావాలని కొన్ని చిన్న పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే కాంగ్రెస్ (5 సీట్లు), అలాగే లెఫ్ట్ పార్టీలైన సీపీఐ (2 సీట్లు), సీపీఐ(ఎం) (2 సీట్లు) విజయ్ పార్టీకి తమ మద్దతు లేఖలను అందించాయి. ఈ ఉత్కంఠ రేపుతున్న రాజకీయ పరిణామాల మధ్యే ఇప్పుడు ఏఎమ్‌ఎమ్‌కే ఎమ్మెల్యే లేఖ వివాదం మరింత మంటలు రేపుతోంది.
Follow Us