/rtv/media/media_files/2025/04/03/aOCyRDpefNAnAHQjAjZZ.jpg)
Trump Tariffs Effect On India
ఏ పదో, పదిహేనో వేస్తారు...పర్వాలేదులే అనుకుంది భారత ప్రభుత్వం. కానీ ట్రంప్ భారత్ మీద ఏకంగా 26 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. పైగా సూటి పోటి మాటలు కూడా అన్నారు. ఒకవైపు మోడీ తనకు మంచి మిత్రుడే అని చెబుతూనే మరోవైపు భారత్ మాకు అన్యాయం చేసింది అంటూ ఆడిపోసుకున్నారు ట్రంప్. భారత్ తమ మీద అన్యాయంగా 52 శాతం సుంకం విధిస్తోందని...అయినా కూడా తాము దయతలిచి 26 శాతమే విధిస్తున్నామని చెప్పుకొచ్చారు. అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్‌లతో పోలిస్తే.. తాము సగం మేర మాత్రమే వసూలు చేస్తున్నామని అన్నారు. వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ విషయాలు వెల్లడించారు.ఈ రోజున ట్రంప్ లిబరేషన్ డే గా నిర్వహించారు.
ప్రతీకార టారీఫ్ లతో అమెరికాకు స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అయ్యారు ట్రంప్. ఇక మీదట అమెరికా భవిష్యత్తు అమెరికా చేతిలోనే ఉందన్నారు. ఈరోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా ఇండస్ట్రీ ఈరోజు పునర్జన్మించినట్లు అయ్యింది. యూఎస్ మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తుండబోతుంది. అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారు. తమ టాక్స్ పేయర్లను గత 50 ఏళ్లుగా దోచుకున్నారు. ఇక అది జరగదు అంటూ స్పీచ్ దంచికొట్టారు ట్రంప్ . పైగా తమకు చాలా జాలి అని అందుకే ఇతర దేశాలు ఎక్కువ సుంకాలు విధిస్తుంటే...ఇప్పుడు కూడా అమెరికా అందులో సగమే టారీఫ్ విధిస్తోందని చెప్పారు. భారత పక్క దేశం చైనా పై విరుచుకుపడ్డారు ట్రంప్. చైనా పై 34 శాతం సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు. యూఎస్ కు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తుల పై కనీసం 10 శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించారు. సుంకాల ద్వారా అమెరికాకు చాలా మేలు జరుగుతుందని ట్రంప్ భావిస్తున్నారు. ఆ దేశం మాటేమో కానీ..ఈ ప్రతీకార సుంకాల వల్ల భారత్ లో కొన్ని రంగాల మీద గట్టి దెబ్బే పడనుంది.
ఇదేమీ ఎదురు దెబ్బ కాదు...
ట్రంప్ టారీఫ్ వల్ల పెద్దగా నష్టమేమీ లేదని అంటున్నారు కేంద్ర ప్రభుత్వంలోని ఓ సీనియర్ అధికారి. దీనిని తాము ఎదురు దెబ్బగా భావించడం లేదని చెబుతున్నారు. ప్రతీకార సుంకాలపై కేంద్ర వాణిజ్య శాఖ విశ్లేషణ ప్రారంభించిందని తెలిపారు. ట్రంప్ టారీఫ్ లవలన భారత దేశంపై ఎంత ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారని చెప్పారు. అమెరికా ప్రస్తుతం చాలా ఆందోళనగా ఉంది. దీన్ని ఏ దేశమైనా తగ్గించగలిగితే...ట్రంప్ కూడా సుంకాల తగ్గింపుకు ఆలోచిస్తారని అంటున్నారు. అందువల్ల ఇది మిశ్రమ ఫలితమే తప్ప నష్టమేమీ లేదని ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు. ట్రంప్ విధించిన 26 శాతం టారిఫ్‌లో.. 10 శాతం సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుందని సదరు అధికారి తెలిపారు. మిగతా 16 శాతం ఏప్రిల్ 10 నుంచి విధించనున్నట్లు చెప్పారు. అయితే వాస్తవం మరోలా ఉంది.
టారీఫ్ లకు ఎఫెక్ట్ అయ్యే రంగాలు..
ట్రంప్ టారీఫ్ల్ వల్ల భారత్ లో ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు, బంగారం, వెండి, బట్టలు, చెప్పులు లాంటి వాటి మీద ఎఫెక్ట్ పడనుంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అంచనా ప్రకారం ప్రతీకార సుంకాల వలన వ్యవసాయ సంబంధిత ఎగుమతులపై అత్యధిక ప్రభావం ఉండనుంది. భారత్ నుంచి రొయ్యలు, ఇతర సీ ఫుడ్ మీద అమెరికా ఇప్పటి వరకు ఎక్కువ ఆధారపడుతోంది. యూఎస్ యే వీటికి ప్రధాన దిగుమతిదారు. 2024లో అమెరికాకు చేపలు, ఇతర ప్రాసెస్డ్ సీఫుడ్ ఎగుమతుల విలువ 2.58 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పుడు ప్రతీకార సుంకాల వలన ప్రాన్స్ లాంటి సీఫుడ్ ధరలు బాగా పెరుగుతాయి. దిగుమతి సుంకాలు పెంచితే ధరలు కూడా పెంచాలి. లేకపోతే వ్యాపారం నడవదు. ఆ లెక్క ప్రకారం ధరలు పెరుగుతాయి, గిరాకీ తగ్గుతుంది. దాంతో దిగుమతే తగ్గిపోతుంది. ఇది భారత్ కు గట్టి దెబ్బ అవుతుంది. అలాగే డెయిరీ ఉత్పత్తులు మీద కూడా ప్రభావం పడనుంది. కొత్త సుంకాల ప్రకారం వీటి మీద టాక్స్ 38.23 శాతానికి చేరుకోనుంది. దీని వలన భారత్ నుంచి దిగుమతి అయ్యే అమెరికాలో నెయ్యి, వెన్న, పాలపొడి ధరలు పెరుగుతాయి. దీంతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, కోకో ఎగుమతులపై ప్రభావం పడనుంది.
బట్టలు, బంగారం..
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న మరో ముఖ్యమైన వస్తువులు బంగారం, వెండి, వజ్రాభరణాలు. ఇప్పుడు సుంకాల పెంపు వలన అమెరికాలో నగల ధరలు బాగా పెరుగుతాయి. అలాగే బట్టల పరిశ్రమలు కూడా ఎఫెక్ట్ అవనున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి 9.6 బిలియన్ డాలర్ల విలువైన దుస్తులు, ఇతర టెక్స్‌టైల్ ఫ్యాబ్రిక్స్ అమెరికాకు ఎగుమతి అయింది. మనం ఉత్పత్తి చేసే మొత్తం టెక్స్‌టైల్ ఎగుమతుల్లో 28 శాతం అమెరికాకే వెళ్తున్నాయి.
చెప్పులు, ఎలక్ట్రానిక్స్..
భారత్ నుంచి ప్రతీ ఏటా 457.66 మిలియన్ డాలర్ల విలువైన ఫుట్‌వేర్ ఉత్పత్తులు యూఎస్‌కు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు ప్రతీకార సుంకాల కారణంగా వీటి మీద 15.56 శాతం సుంకాలు పెరుగుతున్నాయి. దీంతో అక్కడ మన చెప్పుల ధరకు రెక్కలు వస్తాయి. అమెరికా జనాలు కొనడం మానేస్తారు. మన దగ్గర నుంచి ఎగుమతి అవ్వడం తగ్గుతుంది. అలాగే ఎలక్ట్రానిక్స్, టెలికాం ల నుంచి కూడా అమెరికాకు మన దేశం నుంచి సుమారు 14 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. ఇప్పుడు టారీఫ్ ల కారణంగా యూఎస్ మార్కెట్‌లో భారత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. ఇక, బాయిలర్లు, టర్బైన్స్, కంప్యూటర్ల వంటి ధరలు కూడా పెరుగుతాయి.
today-latest-news-in-telugu | trump tariffs on india | effect | pharma
Also Read: Trump Tariffs: ట్రంప్ టారీఫ్ ల వల్ల ప్రాబ్లెమ్ లేదు- భారత్