/rtv/media/media_files/2026/05/05/fotojet-2026-05-05-09-43-06.jpg)
Kalita Majhi
Kalita Majhi : పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక అద్భుత ఘట్టానికి వేదికయ్యాయి. దశాబ్దాల కాలం పాటు ఇళ్లలో అంట్లు తోముతూ, వంట పనులు చేస్తూ నిరుపేద జీవితం గడిపిన ఒక సామాన్య మహిళ, నేడు శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు. కలితా మాఝీ అనే ఈ 37 ఏళ్ల మహిళా నేత విజయం, భారత ప్రజాస్వామ్య గొప్పతనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.
పశ్చిమ బెంగాల్‌లోని ఔస్‌గ్రామ్ (SC) నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కలితా మాఝీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థి శ్యామా ప్రసన్న లోహర్‌పై 12,535 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఆమెకు మొత్తం 1,07,692 ఓట్లు పోలయ్యాయి.గత రెండు దశాబ్దాలుగా కలిత నెలకు కేవలం రూ. 2,500 నుండి రూ. 4,500 సంపాదిస్తూ, 3-4 ఇళ్లలో పనిమనిషిగా జీవనం సాగిస్తున్నారు. ఆమె భర్త ప్లంబర్‌గా పనిచేస్తుండగా, వారికి ఒక కుమారుడు ఉన్నాడు. నేటికీ ఆమె ఇంట్లో టీవీ, ఫ్రిజ్ వంటి కనీస సౌకర్యాలు లేకపోవడం ఆమె నిరుపేద స్థితికి నిదర్శనం.
కలితా మాఝీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు ప్రకటించిన తర్వాత కూడా ఆమె తాను పని చేసే ఇళ్లలో పనులకు వెళ్లడం విశేషం. యజమానులు ఒత్తిడి చేసి ప్రచారానికి పంపించే వరకు ఆమె తన వృత్తిని వదలలేదు.2021 ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ కుంగిపోకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యే ఉంటూ ఈసారి భారీ విజయాన్ని అందుకున్నారు.ఎటువంటి ఆడంబరాలు లేకుండా, ఇంటింటికీ వెళ్లి తనలాంటి పేద ప్రజల కష్టాలను అసెంబ్లీలో వినిపిస్తానని ఆమె చేసిన వాగ్దానం ఓటర్లను కదిలించింది.
ఆమె పని చేసే ఇళ్ల యజమానులు కలితను తమ కుటుంబ సభ్యురాలిగానే భావించారు. ఆమె ప్రచారంలో ఉన్న సమయంలో ఆమె పనులకు రాకపోయినా, ఆమెకు ఇబ్బంది కలగకుండా జీతాన్ని అందజేయడం, ఆమె గెలుపు కోసం వారు కూడా ఆకాంక్షించడం విశేషం. "పాత్రలు కడిగిన అవే చేతులు, ఇప్పుడు బెంగాల్ భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయి" అని స్థానికులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
ఈ ఎన్నికల్లో కలితా మాఝీ విజయం మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర రాజకీయ సమీకరణాలే మారిపోయాయి.మొత్తం 293 నియోజకవర్గాలకు గానూ బీజేపీ 206 స్థానాల్లో గెలుపొంది, తొలిసారి పశ్చిమ బెంగాల్‌లో అధికార పగ్గాలు చేపట్టింది. సుమారు 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు తెరపడింది. తృణమూల్ కాంగ్రెస్ కేవలం 81 స్థానాలకే పరిమితమైంది. ఒక సాధారణ కూలీ, పనిమనిషి కూడా శాసనసభకు వెళ్లగలరని నిరూపించడం ద్వారా, ఈ ఎన్నికలు సామాన్యుడి గెలుపుగా చరిత్రలో నిలిచిపోతాయి."నాలాంటి పేద ప్రజల గొంతుకగా అసెంబ్లీలో మాట్లాడతాను" అని కలిత చెబుతున్న మాటలు ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. పాత్రలు కడిగిన చేతులే ఇప్పుడు పాలనా పగ్గాలు చేపట్టబోతుండటం నిజంగా ఒక సామాజిక విప్లవం.
Follow Us