Shabarimala: శబరిమలలో మహిళలకు ప్రవేశంపై వివాదం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై వివాదం కొనసాగుతోంది. బుధవారం సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. మహిళలను నెలలో 3 రోజుల పాటు అంటరానివాళ్లుగా చూడలేమని సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి.

New Update
Supreme Court hearing on Sabarimala women entry

Supreme Court hearing on Sabarimala women entry

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై వివాదం కొనసాగుతోంది. బుధవారం సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. ఎన్నోఏళ్లుగా కొనసాగుతున్న ఈ సున్నితమైన వివాదంపై మహిళలను నెలలో 3 రోజుల పాటు అంటరానివాళ్లుగా చూడలేమని సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం దీనిపై తుది విచారణ చేపట్టింది. రాజ్యంగంలో ఉన్న ఆర్టికల్ 25, 26 ఇచ్చే మత స్వేచ్ఛ పరిధిని  పరిశీలిస్తోంది. ఇది కేవలం శబరిమల కేసుకే పరిమితం కాకుండా మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, మతాంతర వివాహం చేసుకున్న పార్శీ మహిళల హక్కులు, ఇతర మతపరమైన వివిక్షతలకు సంబంధించిన పిటిషన్లను ధర్మాసనం విచారణ చేస్తోంది.   

అయితే మంగళవారం జరిగిన విచారణలో కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై వాదించారు. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను గుడిలోకి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని వివక్షగా పరిగణించలేమని తెలిపారు. ఇది వాళ్ల మత విశ్వాసాలకు సంబంధించిన అంశమని చెప్పారు. ప్రాథమిక హక్కుల కింద రక్షణ పొందాలంటే ఒక ఆచారం అనేది మూఢనమ్మకం కాకుండా ఆ మతంలోని అత్యవసర ఆచారం అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని గతంలో ఇచ్చిన కోర్టు తీర్పులను ప్రస్తావించారు. 

వీటిపై స్పందించిన ధర్మాసనం సామాజిక రుగ్మతలను మత ఆచారాలుగా పరిగణించలేమని తెలిపింది. మహిళలకు రుతుక్రమం ఆధారంగా వాళ్లను పవిత్ర స్థలాల్లో అంటరానివారిగా చూడటం కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. 2018లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం శబరిమలలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. శతాబ్దాలుగా పాటిస్తున్న ఈ ఆచారం రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది. కానీ 2019లో అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మతపరమైన వివాదాలను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. 

శబరిమలకు మహిళలపై ఎందుకు నిషేధం 

శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామిని "నైష్టిక బ్రహ్మచారి"గా పరిగణిస్తారు. అంటే ఆయన కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటించే దైవం అని అర్థం. అందుకే స్వామి వారి బ్రహ్మచర్య దీక్షకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో రుతుక్రమం వయసున్న (10-50 ఏళ్ల మధ్య) మహిళలను ఆలయంలోకి అనుమతించకూడదనేది ఇక్కడి ప్రధానమైన ఆచారం. ఎన్నో ఏళ్లుగా ఈ ఆచారం అలా కొనసాగుతూనే వస్తుంది. 

అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా 41 రోజుల పాటు దీక్షను పాటించాలి. ఈ సమయంలో బ్రహ్మచర్యం, మాంసాహారం తీసుకోకపోవడం, చెప్పులు లేకుండా నడవడం లాంటి కఠిన నియమాలుంటాయి. అయితే మహిళలకు సహజంగా వచ్చే రుతుక్రమం వల్ల ఈ 41 రోజుల పాటు నిరంతరాయంగా దీక్షను కొనసాగిస్తే సాంప్రదాయబద్ధంగా ఇది సాధ్యం కాదని పూర్వీకులు భావించేవారు. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి తనను వివాహం చేసుకోమని అడిగిన మాలికిపురత్తమ్మకు.. ఏ రోజైతే తన దర్శనం కోసం కన్నె స్వాములు (తొలిసారి మాల వేసుకునేవారు) రావడం మానేస్తారో, ఆ రోజే వివాహం చేసుకుంటానని అయ్యప్ప మాట ఇచ్చారట. అందుకే ఆమె పట్ల గౌరవంతో యువతులు కొండకు వెళ్లరని కొందరు నమ్ముతుంటారు.

 1991లో కేరళ హైకోర్టు శబరిమల ఆచారాన్ని సమర్థించింది.10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు గుడిలో ప్రవేశాన్ని నిషేధిస్తూ తీర్పునిచ్చింది. ఆ తర్వాత 2006లో "ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్" ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది మహిళల సమానత్వ హక్కును (ఆర్టికల్ 14), మత స్వేచ్ఛను (ఆర్టికల్ 25) ఉల్లంఘిస్తుందని వారు వాదించారు. చివరికి 2018లో సుప్రీం ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. ఏ వయస్సు మహిళలైన శబరిమలలో ప్రవేశించవచ్చని తెలిపింది. వాళ్లపై నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. మళ్లీ ఈ తీర్పును సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఈ వివాదం కొనసాగుతూ వస్తోంది. తాజాగా దీనిపై విచారించిన సుప్రీం ధర్మాసనం మహిళలను నెలలో 3 రోజుల పాటు అంటరానివాళ్లుగా చూడలేమని చేసిన వ్యాఖ్యలు చర్చనీయమవుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసును ధర్మాసనం పరిశీలిస్తోంది. 

#telugu-news #national #rtv-news #shabarimala
Advertisment
తాజా కథనాలు