/rtv/media/media_files/2026/04/07/fotojet-4-2026-04-07-18-14-07.jpg)
Suicide drones in the Indian Army's arsenal
Suicide drones : టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ యుద్ధ తంత్రంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత ఇరాన్, అమెరికా యుద్ధంలో డ్రోన్స్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అంటే ఆధునిక యుద్ధ తంత్రంలో డ్రోన్స్ అవసరం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. యుద్ధంలో డ్రోన్స్ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయికీ చేరుకున్నాయని రక్షణ రంగ నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ అమ్ములపొదిలోకి మరో కీలక అస్త్రం వచ్చి చేరింది. శత్రుమూకలను భయకంపితులను చేసే ఆత్మాహుతి డ్రోన్స్‌ను (కామెకాజీ డ్రోన్స్) గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ సంస్థ ఉత్పత్తి చేసింది. వీటిని తాజాగా సైన్యానికి అప్పగించింది. వీటి ఉత్పత్తి కోసం గతంలో ఆర్మీ రూ.10 కోట్లకు ఒప్పందం కుదర్చుకుంది. తాజాగా వందల సంఖ్యలో ఉత్పత్తి చేసిన ఈ డ్రోన్‌లను ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ సంస్థ డెలివరీ చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెల్లడించాయి.
నిజానికి గతేడాది డిసెంబర్‌లోనే ఈ ఒప్పందం కుదిరింది. అత్యవసర ప్రాతిపదికన నెలల వ్యవధిలోనే కంపెనీ ఈ డ్రోన్స్‌ను తయారు చేయడమే కాకుండా ఆర్మీకి సరఫరా చేసింది. మైనస్ 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే కఠిన వాతావరణంలో కూడా ఈ డ్రోన్స్ పనిచేసేలా డిజైన్ చేశామని ఆ సంస్థ వెల్లడించింది.అంతే కాక యుద్ధ స్థలంలోని పరిస్థితులను రియల్‌టైమ్‌లో తెలుసుకునేందుకు ఉపయోగించే ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ తయారీకి కూడా ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ పేరుగాంచిన విషయం తెలిసిందే.
కామెకాజీ డ్రోన్స్ ప్రత్యేకత ఏంటంటే?
ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ ఉత్పత్తి చేసిన ఈ డ్రోన్స్ ఏఐ ఆధారిత గైడెన్స్ వ్యవస్థతో పనిచేస్తాయి. నిపుణులు చెప్పే దాని ప్రకారం ఈ డ్రోన్స్ 2.5 కిలోల వరకూ పేలుడు పదార్థాలను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ డ్రోన్స్ 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడంతో పాటు 10 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సంప్రదాయక దళాలు చేరుకోలేని ప్రాంతాల్లో అత్యధిక రిస్క్ ఉన్న మిషన్స్ కోసం వీటిని వినియోగించనున్నారు. శత్రుదేశంలోని లక్ష్యాలపై అత్యంత కచ్చితంగా, వేగంగా దాడి చేసేందుకు ఈ డ్రోన్స్‌ను వినియోగిస్తారని రక్షణ రంగ నిపుణులు వెల్లడించారు.
Follow Us