JEE Advanced : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 ఫలితాలు...టాప్-10లో ముగ్గురు తెలుగు ఆణిముత్యాలు!

దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో ముగ్గురు తెలుగు విద్యార్థులు టాప్-10లో నిలిచి రికార్డు సృష్టించారు.

New Update
FotoJet (98)

Mohit Shekhar Shukla (4th rank) Kuchi Sandeep (5th rank) Medisetty Naga Saharsha (9th rank)

JEE Advanced  : దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది పరీక్షను నిర్వహించిన ఐఐటీ రూర్కీ, సోమవారం ఉదయం షెడ్యూల్ సమయం కంటే గంటన్నర ముందే (ఉదయం 8:30 గంటలకే) ఫలితాలను అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది.ఈ ఏడాది ఫలితాల్లో ఐఐటీ ఢిల్లీ జోన్ అద్భుత ప్రతిభ కనబరిచి టాప్-3 ర్యాంకులను క్లీన్ స్వీప్ చేయగా.. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సైతం జాతీయ స్థాయిలో సత్తా చాటారు. గత ఏడాది టాప్-10లో కేవలం ఒక్కరికే చోటు దక్కగా, ఈసారి ఏకంగా ముగ్గురు తెలుగు విద్యార్థులు టాప్-10లో నిలిచి రికార్డు సృష్టించారు.

జాతీయ స్థాయి టాపర్లు వీరే..

బిహార్‌లోని గయ ప్రాంతానికి చెందిన శుభమ్ కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. కేవలం ఒక్క మార్కు తేడాతో గురుగ్రామ్‌కు చెందిన కబీర్ చిల్లార్ (329 మార్కులు) రెండో స్థానంలో నిలవగా, జతిన్ చాహర్ (319 మార్కులు) మూడో ర్యాంకును దక్కించుకున్నారు.ఇక అమ్మాయిల విభాగంలోనూ ఐఐటీ ఢిల్లీ జోన్‌కే చెందిన ఆరోహి దేశ్‌పాండే 280 మార్కులతో జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచారు. కామన్ ర్యాంక్ లిస్టు (CRL) లో ఆమె 77వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

 టాప్-10లో ముగ్గురు మనోళ్లే!

తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలు:
మోహిత్ శేఖర్ శుక్లా (ఆలిండియా 4వ ర్యాంక్): హైదరాబాద్‌కు చెందిన మోహిత్ 319 మార్కులు సాధించి తెలంగాణ స్టేట్ టాపర్‌గా, అలాగే ఐఐటీ మద్రాస్ జోన్ టాపర్‌గా నిలిచారు.
కూచి సందీప్ (ఆలిండియా 5వ ర్యాంక్): వైజాగ్‌కు చెందిన సందీప్ 318 మార్కులతో ఐదో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
మేడిశెట్టి నాగ సహర్ష (ఆలిండియా 9వ ర్యాంక్): విశాఖపట్నం జిల్లా పెందుర్తికి చెందిన నాగ సహర్ష 312 మార్కులతో తొమ్మిదో ర్యాంకు సాధించారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర ఉత్తమ ర్యాంకర్లు:

వెల్దుర్తి హర్షిత్ (తిరుపతి) – 15వ ర్యాంక్
ముప్పాళ్ల అనీశ్ (హైదరాబాద్) – 20వ ర్యాంక్
తోట సాయి వినీల్ (కామారెడ్డి) – 24వ ర్యాంక్ (EWS కేటగిరీలో 2వ ర్యాంక్)
బిజ్జం వెంకట చంద్రశేఖర్ రెడ్డి (పల్నాడు జిల్లా) – 38వ ర్యాంక్
కాతా హిమకర్ (విజయనగరం జిల్లా) – 40వ ర్యాంక్
బర్మావత్ కార్తీక్ (కామారెడ్డి) – జనరల్ 3500వ ర్యాంక్ (ST కేటగిరీలో 20వ ర్యాంక్)
పాత్లావత్ గౌతమ్ (రంగారెడ్డి జిల్లా) – ST కేటగిరీలో 73వ ర్యాంక్
గణనీయంగా పెరిగిన కటాప్‌ మార్కులు
గత ఏడాదితో పోలిస్తే ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ కటాఫ్ మార్కులు భారీగా పెరిగాయి. గత ఏడాది జనరల్ కేటగిరీ కటాఫ్ 74 మార్కులుగా ఉండగా, ఈసారి అది ఏకంగా 92 మార్కులకు చేరింది.

కేటగిరీ                      కటాఫ్ మార్కులు (360 కి)

జనరల్ (General)      92
ఓబీసీ (OBC)              82
ఈడబ్ల్యూఎస్ (EWS)82
ఎస్సీ (SC) / ఎస్టీ (ST)46

గణాంకాలు ఒక పరిశీలన

మొత్తం దరఖాస్తుదారులు: 1,87,389
పరీక్షకు హాజరైనవారు: 1,79,694
కౌన్సెలింగ్‌కు అర్హత సాధించినవారు: 56,880 (వీరిలో బాలురు: 46,773, బాలికలు: 10,107)
గత ఏడాదితో పోలిస్తే ఈసారి అర్హత సాధించిన వారి సంఖ్య 2,502 పెరిగింది.

జోన్ల వారీగా హవా: ఐఐటీ మద్రాస్ జోన్ తన హవాను చాటుకుంటూ దేశంలోనే అత్యధికంగా 14,294 మంది విద్యార్థులను క్వాలిఫై చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ జోన్లు నిలిచాయి.

విజేతల అంతరంగం:

'సోషల్ మీడియాకు దూరంగా ఉండటమే మా సక్సెస్ మంత్రం'

రోజుకు 8-10 గంటల సాధనతోనే తొలి ర్యాంక్ - శుభమ్ కుమార్ (ఆలిండియా 1st ర్యాంక్)

"మాది బిహార్‌లోని గయా. రాజస్థాన్ కోటాలో శిక్షణ తీసుకున్నా. ప్రిపరేషన్ సమయంలో సామాజిక మాధ్యమాలకు పూర్తిగా దూరంగా ఉన్నా. ప్రతికూల వార్తలను పట్టించుకోకుండా రోజుకు 8 నుంచి 10 గంటలు చదవడం వల్లే ఈ ఘనత సాధించా. ఫోన్‌ను కేవలం తల్లిదండ్రులు, అధ్యాపకులతో మాట్లాడటానికి మాత్రమే వాడాను. ఒత్తిడి అనిపిస్తే ధ్యానం చేసేవాడిని."

అన్నయ్య బాటలోనే ఐఐటీ బాంబేకు.. - మోహిత్ శేఖర్ శుక్లా (ఆలిండియా 4th ర్యాంక్)

"మా అన్నయ్య ప్రస్తుతం ఐఐటీ బాంబేలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నేను కూడా అక్కడే కంప్యూటర్ సైన్స్ గ్రూప్‌లో చేరాలనే లక్ష్యంతో చదివాను. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ, అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రోజు ఈ ర్యాంకు సాధించగలిగాను."

టాప్-20 లక్ష్యంగా శ్రమించా - కూచి సందీప్ (ఆలిండియా 5th ర్యాంక్)

"మాది వైజాగ్. నాన్న ఫార్మా కంపెనీ మేనేజర్. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో చేరి చదివాను. జేఈఈ మెయిన్స్‌లో 37వ ర్యాంక్ వచ్చింది. అడ్వాన్స్‌డ్‌లో ఎలాగైనా టాప్-20 లోపు రావాలని కష్టపడ్డాను. ఇప్పుడు 5వ ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది."

భవిష్యత్తులో స్టార్టప్ పెడతా - మేడిశెట్టి నాగ సహర్ష (ఆలిండియా 9th ర్యాంక్)

"విశాఖపట్నం పెందుర్తి సమీపంలోని మాది మధ్యతరగతి కుటుంబం. అధ్యాపకుల ప్రణాళికాబద్ధమైన గైడెన్స్ వల్లే ఈ ర్యాంక్ సాధ్యమైంది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి, భవిష్యత్తులో సొంతంగా ఒక స్టార్టప్ కంపెనీ స్థాపించడమే నా ధ్యేయం."

త్వరలోనే జోసా (JoSAA) కౌన్సెలింగ్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన 56,880 మంది విద్యార్థులకు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో సీట్ల కేటాయింపు కోసం జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (JoSAA) త్వరలోనే కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను తనిఖీ చేసుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు