Royal Challengers Bengaluru Win : 'అద్వితీయ' బెంగళూరు.. వరుసగా రెండోసారీ 'కప్‌ నమ్దే'!

ఐపీఎల్‌-19వ సీజన్‌ ఫైనల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఏకపక్ష పోరులో రజత్‌ సేన 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

New Update
FotoJet (73)

Royal Challengers Bengaluru (RCB)

Royal Challengers Bengaluru Win : ఐపీఎల్‌-19వ సీజన్‌ ఫైనల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఏకపక్ష పోరులో రజత్‌ సేన 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాది తొలి కప్‌ను ముద్దాడిన బెంగళూరు, ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తూ 'ఈ సాలనూ కప్‌ నమ్దే' అంటూ అభిమానులను విజయ సంబరాల్లో ముంచెత్తింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ను ఆర్‌సీబీ బౌలర్లు ఆది నుంచే కోలుకోలేని దెబ్బతీశారు. పిచ్‌పై ఉన్న బౌన్స్‌ను చక్కగా ఉపయోగించుకుంటూ గుజరాత్‌ టాప్‌ ఆర్డర్‌ను పడగొట్టారు. సక్సెస్‌ఫుల్‌ ఓపెనర్లుగా పేరొందిన శుభ్‌మన్‌ గిల్‌ (10), సాయి సుదర్శన్‌ (12) నాలుగు ఓవర్ల లోపే పెవిలియన్‌ చేరడంతో గుజరాత్‌ తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. మధ్య ఓవర్లలో రసిఖ్‌, క్రునాల్‌ పట్టు బిగించడంతో ఒక దశలో వరుసగా 5 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు.

మిడిలార్డర్‌ పూర్తిగా విఫలమైన వేళ వెటరన్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ (19), యువ ఆటగాడు నిశాంత్‌ (20) కాసేపు నిలకడగా ఆడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వాషింగ్టన్‌ సుందర్‌ ఒంటరి పోరాటం చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అతను 37 బంతుల్లో 5 ఫోర్లతో 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో.. గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగింది. ఆర్‌సీబీ బౌలర్లలో రసిఖ్‌ సలాం మూడు వికెట్లతో మెరవగా, భువనేశ్వర్‌ కుమార్, జోష్‌ హాజెల్‌వుడ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ను మెరుపు వేగంతో ఆరంభించింది. ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (32) వేగంగా ఆడగా, మరోవైపు రారాజు విరాట్‌ కోహ్లీ (42 బంతుల్లో 75 నాటౌట్‌, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ హాఫ్‌ సెంచరీతో జట్టును గెలిపించాడు. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లోనే కోహ్లీ 19 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో కేవలం 25 బంతుల్లోనే ఐపీఎల్‌ కెరీర్‌లోనే తన ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. మధ్యలో రజత్‌ (15), టిమ్‌ డేవిడ్‌ (24)లు అవుటైనా, కోహ్లీ కడవరకు నిలిచి 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు.

ఈ విజయంతో బెంగళూరు కెప్టెన్‌ రజత్‌ పటీదార్‌ ఐపీఎల్‌ చరిత్రలో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సారథిగా బాధ్యతలు చేపట్టిన తొలి రెండు సీజన్లలోనూ జట్టును విజేతగా నిలిపిన తొలి కెప్టెన్‌గా రజత్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ రెండు వికెట్లు తీసినప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. క్వాలిఫయర్‌-2లో అద్భుత పోరాటం చేసిన గిల్‌ సేన, ఫైనల్లో సొంతగడ్డపై నిరాశపరిచి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

ఫైనల్‌ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్‌ కోహ్లీకి 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కగా, టోర్నీ అంతటా రాణించిన యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ'గా నిలిచాడు. టైటిల్‌ విజేతగా నిలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీ దక్కగా, రన్నరప్‌ గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు రూ. 12.50 కోట్లు లభించాయి.

ఈ 19వ సీజన్‌లో రాజస్థాన్‌కు చెందిన వైభవ్‌ సూర్యవంశీ 776 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడమే కాకుండా, టోర్నీలో అత్యధికంగా 72 సిక్సర్లు బాది సరికొత్త రికార్డు సృష్టించాడు. గుజరాత్‌ ఆటగాళ్లు శుభ్‌మన్‌ గిల్‌ (732), సాయి సుదర్శన్‌ (722) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఆర్‌సీబీ తరఫున కోహ్లీ 675 పరుగులు చేశాడు. ఢిల్లీ ఆటగాడు కె.ఎల్‌. రాహుల్‌ (152 నాటౌట్‌) అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయగా, చెన్నై తరఫున ఆడిన సంజూ శాంసన్‌ ఈ సీజన్‌లో అత్యధికంగా 2 శతకాలు బాదాడు.

బౌలింగ్‌ విషయానికి వస్తే గుజరాత్‌ టైటాన్స్‌ స్పీడ్‌స్టర్‌ కగిసో రబాడ 29 వికెట్లతో ఈ సీజన్‌లో టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఆర్‌సీబీ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ 28 వికెట్లు పడగొట్టి, ఒకే ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా మహమ్మద్‌ షమితో సంయుక్తంగా నిలిచాడు (హర్షల్‌ పటేల్‌ 32 వికెట్లతో ప్రథమ స్థానంలో ఉన్నాడు). అలాగే లఖ్‌నవూకు చెందిన మొహిసిన్‌ ఖాన్‌ (5/23) ఈ సీజన్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ ప్రదర్శన నమోదు చేశాడు.

Advertisment
తాజా కథనాలు