/rtv/media/media_files/2026/05/16/paper-2026-05-16-18-24-30.jpg)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ 2026 క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ స్కామ్‌లో తాజాగా పుణెకు చెందిన బోటనీ టీచర్ మనీషా గురునాథ్ మాంధరేను సీబీఐ అధికారులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. అరెస్ట్ అయిన మనీషా మాంధరే సాధారణ టీచర్ కాదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెను నీట్ పరీక్ష ప్రక్రియ కోసం సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ గా నియమించింది. నమ్మకమైన ఈ పదవిలో ఉంటూనే ఆమె అక్రమాలకు తెరలేపింది. గత ఏప్రిల్ నెలలో, పుణెకు చెందిన మరో నిందితురాలు మనీషా వాగ్మారే సహాయంతో నీట్ రాసే కొంతమంది విద్యార్థులను సంప్రదించింది.
రహస్య కోచింగ్ క్లాసులు ఇచ్చి
తన ఇంట్లోనే ఆ విద్యార్థులకు ప్రత్యేకంగా రహస్య కోచింగ్ క్లాసులు ఇచ్చింది. ఆ సమయంలో మే 3న జరగబోయే నీట్ పరీక్షలో రాబోయే బోటనీ, జువాలజీ ప్రశ్నలను ముందే లీక్ చేసి.. వాటిని విద్యార్థుల నోట్‌బుక్స్‌లో రాయించడమే కాకుండా, టెక్స్ట్‌బుక్స్‌లో మార్క్ చేయించింది. మే 3న జరిగిన అసలు పరీక్ష పేపర్‌లోని ప్రశ్నలు, ఈమె చెప్పిన ప్రశ్నలు హూబహూ ఒకేలా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది.
ఈ కుంభకోణానికి సంబంధించి సరిగ్గా ఒక్క రోజు ముందే సీబీఐ ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన పి.వి. కుల్కర్ణి అనే కెమిస్ట్రీ లెక్చరర్‌ను అరెస్ట్ చేసింది. ఎన్‌టీఏ తరపున ఇతనికి నీట్ క్వశ్చన్ పేపర్లు యాక్సెస్ చేసే అవకాశం ఉండటంతో.. కెమిస్ట్రీ పేపర్‌ను లీక్ చేశాడు. కుల్కర్ణి, మనీషా వాగ్మారే ఇద్దరూ కలిసి ఏప్రిల్ చివరి వారంలో పుణెలోని తన నివాసంలో ప్రత్యేక క్లాసులు పెట్టి, ఆప్షన్లతో సహా కెమిస్ట్రీ ప్రశ్నలను విద్యార్థులకు డిక్టేట్ చేశారని దర్యాప్తులో తేలింది. లీకైన కెమిస్ట్రీ, బయాలజీ పేపర్ల కోసం విద్యార్థుల నుండి ఏజెంట్లు లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు సీబీఐ గుర్తించింది.
గడిచిన 24 గంటల్లో సీబీఐ దేశవ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో ముమ్మర సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.ప్రస్తుతం అరెస్ట్ అయిన 9 మంది నిందితులు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పుణె, అహిల్యానగర్ ప్రాంతాలకు చెందినవారు. వీరిలో ఐదుగురిని కోర్టు 7 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వగా.. పుణెలో అరెస్ట్ అయిన ఇద్దరిని ఢిల్లీకి తరలిస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 12న కేసు నమోదు చేసిన సీబీఐ.. ఈ భారీ నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో సహా పెకలించే పనిలో పడింది.
Follow Us