/rtv/media/media_files/2026/04/30/supreme-court-2026-04-30-14-44-30.jpg)
Supreme Court
Supreme Court :పెళ్లికి ముందు ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం పెట్టుకోవడం వారి ప్రవర్తనకు లేదా ‘క్యారెక్టర్’కు కొలమానం కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. సమకాలీన సమాజంలో మారుతున్న సామాజిక వాస్తవాలను, కాలమాన పరిస్థితులను ప్రభుత్వ నియామక బోర్డులు గుర్తించాలని సుప్రీంకోర్టు హితబోధ చేసింది. వివాహానికి ముందు సంబంధాలు ప్రస్తుత రోజుల్లో సాధారణమయ్యాయని, అవివాహితులైన వయోజనులు తమకు ఇష్టమైన వారితో సంబంధం కొనసాగించకుండా నిషేధించే చట్టమేదీ దేశంలో లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇద్దరు యువతీ యువకుల మధ్య నెలకొన్న సంబంధం అంతిమంగా వివాహానికి దారి తీయకపోతే, అందులో ఒకరు మరొకరిని మోసం చేసినట్లు భావించడానికి వీల్లేదని ధర్మాసనం పేర్కొంది. ప్రతి ప్రేమకథా పెళ్లితోనే ముగియాలని నియమమేమీ లేదని, బంధం విఫలమైనంత మాత్రాన క్రిమినల్ ఉద్దేశంతో మోసం చేసినట్లు కాదని స్పష్టం చేసింది. బాధితురాలిని వివాహం చేసుకుంటానని అబద్ధపు హామీతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నారనే ఫిర్యాదుల విషయంలో పరస్పర అంగీకారం కూడా ఉండే అవకాశం ఉన్నందున, గతంలో న్యాయస్థానాలు ఇలాంటి పలు కేసులను కొట్టేసిన సందర్భాలను కోర్టు గుర్తు చేసింది.
తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి అనే యువకుడి కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుపతి 2018 నోటిఫికేషన్ ద్వారా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే, గతంలో అతనిపై ఐపీసీ సెక్షన్లు 417, 420, 506 కింద ఒక క్రిమినల్ కేసు నమోదై ఉండటాన్ని కారణం చూపుతూ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అతని నియామకాన్ని రద్దు చేసింది. తిరుపతి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లు బంధంలో ఉండి, ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అతనిపొరుగున ఉండే యువతి 2014లో కేసు పెట్టడమే దీనికి కారణం.
నిజానికి, ఈ కేసుకు సంబంధించి 2015లోనే ఇరుపక్షాల మధ్య లోక్ అదాలత్‌లో రాజీ కుదిరింది. ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పుడే తనపై ఉన్న ఈ పాత కేసు వివరాలన్నింటినీ తిరుపతి అప్లికేషన్ ఫామ్‌లో అత్యంత నిజాయితీగా పేర్కొన్నాడు, ఏ విషయాన్నీ దాచలేదు. అయినప్పటికీ, అతను నైతిక విలువలకు సంబంధించిన కేసులో ఇరుక్కున్నాడని, మోసానికి పాల్పడ్డాడని రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు భావించి, అతనిని ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించారు.
బోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తూ తిరుపతి హైకోర్టును ఆశ్రయించగా.. సింగిల్ జడ్జి (ఏకసభ్య ధర్మాసనం) అతనికి అనుకూలంగా తీర్పునిచ్చారు. అతన్ని ఉద్యోగంలోకి తీసుకుని తదుపరి బ్యాచ్‌లోనైనా శిక్షణకు పంపాలని ఆదేశించారు. అయితే, ఈ తీర్పును పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయగా, డివిజన్ బెంచ్ బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి తీర్పును తప్పుబట్టింది. దీంతో తనకు జరిగిన అన్యాయంపై తిరుపతి గత ఏడాది ఆగస్టు 20న సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. లోక్ అదాలత్‌లో ఇరుపక్షాలు రాజీ పడినంత మాత్రాన.. దానిని నేరాంగీకారంగా (తప్పు చేశానని ఒప్పుకొన్నట్లుగా) భావించడం నియామక బోర్డు అజ్ఞానమేనని ధర్మాసనం తీవ్రంగా మందలించింది. ఒక విఫలమైన ప్రేమ వ్యవహారం నేపథ్యంలో నమోదైన పాత క్రిమినల్ కేసు ఆధారంగా.. కానిస్టేబుల్‌గా అభ్యర్థి ఎంపికను రద్దు చేయడంపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ కేసులో పెళ్లిపేరుతో యువతిని మోసగించాడన్నది ప్రధాన ఆరోపణ కాగా, తాను మోసపోయానా లేదా అన్నది సదరు యువతి మాత్రమే చెప్పగలరని కోర్టు పేర్కొంది. ఇక్కడ బాధితురాలు విచారణ కోసం ఒత్తిడి చేయడంగానీ, సాక్ష్యాధారాలను చూపడంగానీ చేయలేదని, పైగా రాజీ కుదుర్చుకోవడానికి ఆమే స్వచ్ఛందంగా అంగీకరించినప్పుడు అభ్యర్థి నైతిక ప్రవర్తనను అనుమానించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అభ్యర్థి బాధితురాలిపై ఒత్తిడి తెచ్చి రాజీ చేసుకున్నట్లు ఆధారాలు ఉంటే బోర్డు చర్యను సమర్థించేవాళ్లమని, కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదని కోర్టు తేల్చింది.
కోర్టులో నేరాభియోగాలు నిరూపితమయ్యేంతవరకూ అందరూ నిర్దోషులేనని ధర్మాసనం గుర్తుచేసింది. సరైన సాక్ష్యాధారాలు లేకుండా కేవలం ఆరోపణల ఆధారంగా అభ్యర్థి ఉద్యోగానికి పనికిరాడనే ముద్ర వేయడం, నియామకాన్ని నిరాకరించడం పూర్తిగా ఏకపక్షమని తప్పుబట్టింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ, సింగిల్ జడ్జి తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. బాధితుడైన గాజుల తిరుపతికి తక్షణమే కానిస్టేబుల్ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేయాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది.
Follow Us