/rtv/media/media_files/2025/11/03/mamatha-2025-11-03-09-29-03.jpg)
Mamata Banerjee
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల లెక్కింపునకు కొద్ది గంటల ముందు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా బీజేపీపై సంచలన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలను అప్రమత్తం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ట్వీట్లు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆమె ఆరోపించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రాంతాల్లో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం వెనుక ఏదో మతలబు ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. హుగ్లీలోని శ్రీరాంపూర్, నదియాలోని కృష్ణానగర్, బుర్ద్వాన్‌లోని ఆస్‌గ్రామ్, కోల్‌కతాలోని ఖుదీరామ్ అనుశీలన్ కేంద్రం వంటి చోట్ల విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు తమకు నివేదికలు అందాయని ఆమె తెలిపారు. విద్యుత్ నిలిపివేయడం ద్వారా సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేస్తున్నారని, అదే సమయంలో స్ట్రాంగ్ రూమ్‌ల వద్దకు అనుమానాస్పద వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని ఆమె ఆరోపించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండాలని మమతా బెనర్జీ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు."నేను ప్రతి విషయాన్ని పర్యవేక్షించడానికి రాత్రంతా మేల్కొని ఉన్నట్లే, మీరు కూడా రాత్రంతా నిద్రపోకుండా స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పహారా కాయాలి. ప్రజలు వేసిన ప్రతి ఓటును కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది" అని ఆమె ట్వీట్ చేశారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే మౌనంగా ఉండవద్దని, వెంటనే సంబంధిత అధికారులను నిలదీసి అధికారికంగా ఫిర్యాదు చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏమాత్రం అజాగ్రత్తగా ఉండవద్దని ఆమె హెచ్చరించారు.
కాగా బెంగాల్ ఎన్నికల ప్రచార సమయం నుంచే ఈవీఎంల భద్రత, కేంద్ర బలగాల మోహరింపుపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మిశ్రమంగా ఉన్న తరుణంలో, మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగి ఇలాంటి ఆరోపణలు చేయడం కౌంటింగ్ ప్రక్రియపై ఉత్కంఠను మరింత పెంచింది.మరోవైపు, ఈ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేస్తోంది. ఓటమి భయంతోనే మమతా బెనర్జీ ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కమలనాథులు కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా, మరికొద్ది గంటల్లో వెలువడనున్న ఫలితాలు ఈ ఆరోపణలకు, అనుమానాలకు సమాధానం చెప్పనున్నాయి.
Follow Us