New Update
/rtv/media/media_files/2026/06/14/tmc-2026-06-14-06-57-00.jpg)
TMC
TMC Rebel MPs : పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై 19 మంది ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. లోక్‌సభలో అసలైన తృణమూల్ కాంగ్రెస్ వర్గం తమదేనని, తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వినతిపత్రం ఇచ్చేందుకు రెబల్ ఎంపీలు సిద్ధమయ్యారు. పార్టీలో తిరుగుబాటు చేసిన ఎంపీలంతా ఆదివారం న్యూఢిల్లీలో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ నెల 15వ తేదీన (సోమవారం) వీరంతా స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమ లేఖను సమర్పించనున్నారు.
ఈ రాజకీయ సంక్షోభంలో మమతా బెనర్జీకి మరో పెద్ద షాక్ తగిలింది. టీఎంసీ పార్లమెంటరీ పార్టీలో సుదీర్ఘ కాలంగా కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ శనివారంనాడు రెబల్స్ గ్రూపులో చేరారు. అనంతరం ఆయన మరో అసమ్మతి ఎంపీ శతాబ్ది రాయ్‌తో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. సుదీప్ బందోపాధ్యాయ్ కూడా తిరుగుబాటు లేఖపై సంతకం చేయడంతో అసమ్మతి ఎంపీల సంఖ్య 20కి చేరినట్లయింది. కాగా, తిరుగుబాటుకు పాల్పడిన సుదీప్ బందోపాధ్యాయ్‌తో పాటు సయానీ ఘోష్ తదితర రెబల్ ఎంపీలను పార్టీ పదవుల నుంచి మమతా బెనర్జీ తక్షణమే తొలగించారు.
మమతా బెనర్జీపై తిరుగుబాటు అకస్మాత్తుగా జరిగింది కాదని, దీని వెనుక గత కొన్ని రోజులుగా వ్యూహాత్మక కసరత్తు జరుగుతోందని స్పష్టమవుతోంది. జూన్ 8 నుంచే టీఎంసీ అసమ్మతి ఎంపీల సంతకాల సేకరణ చేపట్టామని, ఇప్పటికే 19 మంది ఎంపీలు సంతకాలు చేశారని రెబల్ ఎంపీ చంద్ర బర్మ బసునియా వెల్లడించారు. ఇప్పటికే ఒకసారి స్పీకర్‌ను కలిసిన అసమ్మతి వర్గం.. ఈ నెల 15న మరోసారి కలిసి తమ గ్రూపునే నిజమైన టీఎంసీగా గుర్తించాలని అధికారికంగా కోరనుంది. అయితే, ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తమపై వేటు పడే అవకాశం ఉందన్న న్యాయ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో, రెబల్ ఎంపీలు లీగల్ టీంతో సుదీర్ఘంగా చర్చిస్తూ రక్షణ మార్గాలను అన్వేషిస్తున్నారు.
మరోవైపు, పశ్చిమ బెంగాల్ రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది. అసమ్మతి ఎంపీల ఢిల్లీ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా హాజరవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందంటూ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. అయితే, ఈ వార్తలను టీఎంసీ జాతీయ సంయుక్త కార్యదర్శి, సీనియర్ నేత డెరెక్ ఒబ్రెయిన్‌తో పాటు ఆ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ తీవ్రంగా ఖండించారు. అదంతా ఫేక్ ప్రచారమని, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వారు కొట్టిపారేశారు.
ఈ రాజకీయ వేడి ఇలా ఉంటే, మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ కీలక నేత అభిషేక్ బెనర్జీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అక్రమ లావాదేవీలకు సంబంధించిన కేసులో అభిషేక్ బెనర్జీ పీఏ సుమిత్ రాయ్ కోసం పోలీసులు శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అభిషేక్ నివాసంలో హఠాత్తుగా సోదాలు నిర్వహించారు. ఈ సమాచారం తెలియగానే సీఎం మమతా బెనర్జీ స్వయంగా అభిషేక్ నివాసానికి చేరుకుని, సోదాలు ముగిసేవరకు అక్కడే ఉన్నారు. కాగా, ఈ అక్రమ లావాదేవీల వ్యవహారంలో ఈ నెల 16న తమ ముందు విచారణకు హాజరుకావాలని అభిషేక్ బెనర్జీకి సీఐడీ మరోమారు సమన్లు జారీ చేసింది.
తమ పార్టీ ఎంపీల తిరుగుబాటుపై తృణమూల్ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. అసమ్మతి వర్గం వాదనకు ఎలాంటి చట్టబద్ధత లేదని ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్ర స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 91వ సవరణ ప్రకారం పార్టీలో చీలిక (Split) ప్రొవిజన్‌ను పూర్తిగా తొలగించారని ఆమె గుర్తు చేశారు. ఆ 19 మంది 'ద్రోహులు' వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి, దమ్ముంటే బీజేపీ టికెట్‌పై పోటీ చేయాలని ఆమె సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా సవాల్ విసిరారు. బీజేపీ 'ఆపరేషన్ లోటస్' పేరుతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, కానీ పార్టీని చీల్చాలనే వారి కుట్రలు ఏమాత్రం సాగవని ఎంపీ కీర్తి ఆజాద్ ధీమా వ్యక్తం చేశారు.
తాజా కథనాలు
Follow Us