/rtv/media/media_files/2026/04/26/fotojet-2026-04-26-12-35-25.jpg)
Swiss Air fire Delhi
Delhi airport flight fire : న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు బయల్దేరాల్సిన స్విస్ ఎయిర్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ330 విమానం రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం గాలిలోకి ఎగిరేందుకు వేగంగా దూసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి మంటలు చెలరేగాయి. ఇంజిన్ వైఫల్యాన్ని తక్షణమే గుర్తించిన పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి టేకాఫ్‌ను నిలిపివేశారు. విమానాన్ని రన్‌వేపైనే సురక్షితంగా ఆపివేసి అత్యవసర రక్షణ చర్యలు ప్రారంభించడంతో లోపల ఉన్న ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
Emergency evacuation from Swiss Delhi - Zurich flight LX0147 pic.twitter.com/rvzhCPb3bg
— Ishan Jain (@JainIshan316) April 25, 2026
అగ్ని ప్రమాదం సంభవించగానే విమాన సిబ్బంది అత్యవసర ద్వారాలను తెరిచి, స్లైడ్ల ద్వారా ప్రయాణికులను కిందకు దించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న గందరగోళం ,తొందరపాటు వల్ల ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని విమానాశ్రయ వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం 232 మంది ఉన్నట్లు సమాచారం. అధికారులు, విమాన సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని, ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఆ విమానంలోని ప్రయాణికులకు విమానాశ్రయ సమీపంలోని హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు స్విస్ ఎయిర్ యాజమాన్యం ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. విమానం ఇంజిన్‌లో మంటలు రావడానికి గల కచ్చితమైన కారణాలపై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. టేకాఫ్ సమయంలోనే మంటలను గుర్తించి ఆపివేయడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పిందని, లేనిపక్షంలో గాలిలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉంటే ఫలితం దారుణంగా ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Follow Us