Supreme Court : CBSE త్రిభాషా సూత్రంపై పిటిషన్‌ .. కేంద్రానికి ‘సుప్రీం’ నోటీసులు

CBSE 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రతిపాదించిన నూతన ‘త్రిభాషా సూత్రం’ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నూతన భాషా విధానంపై చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగీకరించింది.

New Update
Supreme Court Closes BRS Defection Case Following Speaker's Decision

Petition on CBSE's three-language principle... 'Supreme' notices to the Center

Supreme Court : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రతిపాదించిన నూతన ‘త్రిభాషా సూత్రం’ (Three-Language Formula) దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నూతన భాషా విధానంపై చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది. ఈ మేరకు నూతన విధానంపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్‌ఈ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)లకు సర్వోన్నత న్యాయస్థానం కీలక నోటీసులు జారీ చేసింది. రాబోయే రెండు వారాల్లోగా దీనిపై తమ అఫిడవిట్లను దాఖలు చేస్తూ వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున దేశంలోనే అత్యంత సీనియర్ న్యాయవాదులైన ముకుల్ రోహత్గి, కపిల్ సిబల్‌లు హాజరై తమ బలమైన వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా కపిల్ సిబల్ వాదిస్తూ.. విద్యా విధానంలో భాషను ఎంచుకోవడం అనేది పూర్తిగా విద్యార్థుల వ్యక్తిగత ఇష్టానికి (ఛాయిస్) సంబంధించిన విషయమని, దానిని బలవంతంగా వారిపై రుద్దలేమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులతో మరియు రాజ్యాంగపరమైన అంశాలతో ముడిపడి ఉందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నూతన విధానం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కావున దీనిపై తక్షణమే స్టే (మధ్యంతర ఉత్తర్వులు) జారీ చేయాలని పిటిషనర్లు కోరగా, అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయం (Policy Decision) కాబట్టి దీనిపై కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం చేశాకే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేసింది. అయితే, ఈ త్రిభాషా విధానాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి సీబీఎస్‌ఈకి ఉన్న ల్యాజిస్టికల్ సంసిద్ధత (ఉపాధ్యాయుల లభ్యత, పాఠ్యపుస్తకాలు తదితర వసతులు)పై పూర్తి నివేదిక సమర్పించాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అసలు వివాదానికి కారణమైన సీబీఎస్‌ఈ నూతన నిబంధనల ప్రకారం.. 2026-27 విద్యా సంవత్సరం నుండి 9వ తరగతిలోకి వచ్చే విద్యార్థులు ఇకపై తప్పనిసరిగా మూడు భాషలను అభ్యసించాల్సి ఉంటుంది. ఈ మే 15న జారీ చేసిన ప్రత్యేక సర్క్యులర్ ప్రకారం.. ఈ మూడు భాషలలో కనీసం రెండు తప్పనిసరిగా స్థానిక లేదా అధికారిక ‘భారతీయ భాషలు’ అయి ఉండాలి. ఒకవేళ ఎవరైనా విద్యార్థి ఫ్రెంచ్, జర్మన్ వంటి విదేశీ భాషలను (Foreign Languages) చదవాలని కోరుకుంటే, దానిని కేవలం ‘తృతీయ భాష’ (Third Language)గా మాత్రమే ఎంపిక చేసుకునేందుకు వీలుంటుంది. నూతన జాతీయ విద్యా విధానం (NEP)-2020, పాఠశాల విద్య జాతీయ పాఠ్య ప్రణాళిక (NCF)-2023 మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్‌ఈ సమర్థించుకుంటోంది.

అయితే, ఈ నూతన విధానాన్ని విద్యా సంవత్సరం మధ్యలో, అదీ జులై 1 నుంచే కఠినంగా అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించడంపై విద్యావేత్తలు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు విదేశీ భాషలను లేదా కేవలం రెండు భాషలను (ఇంగ్లీష్, హిందీ/తెలుగు వంటివి) సెకండ్ లాంగ్వేజ్‌గా చదువుతున్న విద్యార్థులపై ఇది అకస్మాత్తుగా అదనపు మానసిక భారాన్ని మోపుతుందని ఆందోళన చెందుతున్నారు. అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యాక ఇలాంటి నిబంధనలు తీసుకురావడం విద్యార్థుల గ్రేడ్‌లను, భవిష్యత్తును దెబ్బతీస్తుందని పిటిషనర్లు వాదిస్తున్నారు. రాబోయే జులై రెండో వారంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఈ త్రిభాషా సూత్రం భవితవ్యం ఆధారపడి ఉంది.

Advertisment
తాజా కథనాలు