/rtv/media/media_files/2026/04/15/omar-abdullah-2026-04-15-15-08-34.jpg)
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన దేశభక్తిని, జాతీయ జెండా పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని చాటుకున్నారు. బుధవారం (ఏప్రిల్ 15) శ్రీనగర్‌లోని కాశ్మీర్ హాట్‌లో ఏర్పాటు చేసిన రెండు రోజుల 'హస్తకళలు & చేనేత ప్రదర్శన' ప్రారంభోత్సవంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ఏ కార్యక్రమమైనా రిబ్బన్ కత్తిరించి ప్రారంభిస్తారు, కానీ ఇక్కడ రిబ్బన్ రంగులు చూసి ముఖ్యమంత్రి వెనక్కి తగ్గారు.
ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వేదిక వద్దకు చేరుకోగానే, నిర్వాహకులు ప్రారంభోత్సవం కోసం జాతీయ జెండా రంగులో (కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) ఉన్న రిబ్బన్‌ను సిద్ధం చేశారు. రిబ్బన్ కట్టింగ్ కోసం వచ్చిన అబ్దుల్లా.. ఒక్కసారిగా దాని రంగులను గమనించి ఆగిపోయారు. అది జాతీయ జెండా రంగులను పోలి ఉండటంతో, దానిని కత్తిరించడం త్రివర్ణ పతాకానికి అవమానం కలిగించడమేనని ఆయన భావించారు.
Jammu and Kashmir Chief Minister @OmarAbdullah refuses to cut the ribbon in colours of the Indian National Flag at an event pic.twitter.com/DNQIm2hjzw
— Shreya Upadhyaya (@ShreyaOpines) April 15, 2026
వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి, ఆ రిబ్బన్‌ను కత్తిరించడానికి నిరాకరించారు. దానిని విప్పి, తగిన గౌరవంతో భద్రపరచమని నిర్వాహకులకు సూచించారు. ఈ అరుదైన దృశ్యం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జాతీయ చిహ్నాల పట్ల ఆయన చూపిన భక్తి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
వైభవంగా కొనసాగిన కార్యక్రమం
రిబ్బన్‌ను పక్కన పెట్టిన తర్వాత, ముఖ్యమంత్రి యథావిధిగా ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి, సలహాదారు నాసిర్ అస్లాం వానీ కూడా ఉన్నారు. అనంతరం జరిగిన సభలో ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ జాతీయ జెండా గొప్పతనాన్ని వివరించారు. "జాతీయ పతాకం మన ఐక్యత, శాంతి, సామరస్యాలకు సజీవ చిహ్నం. ఇది తరతరాల ఆశలను, త్యాగాలను మోస్తుంది. భారతదేశపు నిజమైన బలం మన వైవిధ్యం, దానిని ఈ త్రివర్ణ పతాకం ప్రతిబింబిస్తుంది. ప్రతి ఒక్కరూ లౌకికవాదం, సోదరభావం వంటి ఆదర్శాలను నిలబెట్టాలి," అని ఆయన పిలుపునిచ్చారు.
మార్పు కోసం పోరాటం
గతంలో జాతీయ జెండాను కేవలం ప్రభుత్వ కార్యాలయాలపైనే ఎగురవేసేవారని, కానీ ఒక వ్యక్తి చేసిన న్యాయపోరాటం వల్ల నేడు సామాన్యులు కూడా తమ ఇళ్లపై జెండాను ఎగురవేసే హక్కును సాధించారని ఆయన గుర్తుచేశారు. "మన జాతీయ జెండా మన గుర్తింపు. దాని గౌరవాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత," అని అబ్దుల్లా స్పష్టం చేశారు. 2025 ఆగస్టులో కూడా ఆయన దాల్ సరస్సు వద్ద జరిగిన త్రివర్ణ యాత్రలో పాల్గొని దేశభక్తిని చాటుకున్న విషయం విదితమే.
Follow Us