మా మొదటి తీర్మానం దానిపైనే.. జమ్మూకశ్మీర్‌ కాబోయే సీఎం సంచలన ప్రకటన!

జమ్మూకశ్మీరుకు కాబోయే సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రాష్ట్ర హోదా డిమాండ్ తీర్మానాన్ని మోదీకి అందిస్తామన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్ర హోదా అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

New Update
ddrd

Omar Abdullah: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో  నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఒమర్.. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జమ్మూ-కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రధాని మోదీకి అందిస్తామన్నారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్ర హోదాకు సంబంధించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. 

కశ్మీర్‌ను ఢిల్లీతో పోల్చి చూడొద్దు..

ఈ మేరకు ఒమర్ మాట్లాడుతూ.. 'కశ్మీర్‌ను ఢిల్లీతో పోల్చి చూడొద్దు. ఎందుకంటే దేశ రాజధానికి రాష్ట్ర హోదా ఇస్తామని ఎవరూ చెప్పలేదు. కానీ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని మోదీ, హోంమంత్రితోపాటు సీనియర్‌ మంత్రులు హామీ ఇచ్చారు. 2019 వరకు జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంగానే ఉంది. కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడంతోపాటు అభివృద్ధికి బాటలు వేయాలంటే రాష్ట్ర హోదా తప్పనిసరి. ఆర్టికల్‌ 370ని రద్దుతో జమ్మూకశ్మీర్‌ 2019లో ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కోల్పోయింది. దీంతో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిపోయింది. జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నాం' అన్నారు. 

మిత్రపక్షాలతో చర్చల తర్వాతే తుది నిర్ణయం..

ఇక ముఖ్యమంత్రిగా తన పేరును తన తండ్రి ప్రకటించడంపై ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు. నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభా పక్ష సమావేశం అనంతరం మిత్రపక్షాలతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే కశ్మీర్‌లో రాజకీయ పార్టీలను బీజేపీ లక్ష్యంగా చేసుకొని బలహీనపరచడానికి ప్రయత్నించిందంటూ మండిపడ్డారు. బీజేపీ ఆటలు జమ్మూ కశ్మీర్ లో సాగవన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు