Noida Workers Protest: రణరంగమైన నోయిడా..జీతాల పెంపుకోసం కార్మికుల ఆందోళన హింసాత్మకం

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జీతాలు పెంచాలని కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. గత మూడు రోజులుగా నిరసన చేస్తున్న కార్మికులంతా నేడు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. పరిశ్రమపై రాళ్లు విసిరారు. కార్లు తగలబెట్టి, రహదారులను దిగ్బంధించారు.

New Update
FotoJet (57)

Workers' agitation for wage hike turns violent

Noida Workers Protest : ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జీతాలు పెంచాలని కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. గత మూడు రోజులుగా నోయిడా పారిశ్రామికవాడ లో నిరసన చేస్తున్న కార్మికులంతా నేడు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. పరిశ్రమ ముందు కార్మికులు పెద్ద సంఖ్యలో గుమిగూడి రాళ్లు విసిరారు. కార్లు తగలబెట్టి, రహదారులను దిగ్బంధించారు. పలు వాహనాలకు నిప్పుపెట్టగా.. మరికొన్నింటిని ధ్వంసం చేశారు. వేలాది మంది కార్మికులు వీధులు, రహదారులపైకి వచ్చి న్యాయం చేయాలంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్మికులను చెదర గొట్టడానికి లాఠీచార్జీ చేయడంతో పాటు టియర్‌ గ్యాస్ ను ప్రయోగించారు. ఈ ఘటనతో నోయిడాలోని  రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రద్దీగా ఉండే డీఎన్‌డీ ఫ్లైఓవర్‌తో పాటు కీలకమైన ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. నోయిడా ఫేజ్-2 ప్రాంతంలో ముఖ్యంగా సెక్టార్ 1, సెక్టార్ 84లో ఆందోళనలు తీవ్రమయ్యాయి. భారీగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనకారులు పోలీసులపైకి కూడా రాళ్లు రువ్వడంతో అక్కడ యుద్ధవాతావరణం కనిపించింది.

Also Read: ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా..? 90's కుర్రాళ్ల కలలరాణి.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి

ఇటీవల హరియాణా ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు కనీస వేతనాన్ని 35శాతం వరకు పెంచింది. ఈ క్రమంలోనే యూపీలో కార్మికులు ఆందోళనలకు దిగారు. వేతన పెంపుతో పాటు పని ప్రదేశంలో మెరుగైన పరిస్థితుల కోసం వారు నిరసనలు చేపట్టారు. ‘‘పని ప్రదేశాల్లో మాకు భద్రత కల్పించాలి. యంత్రాంగాల కొరత, వారాంతాల సెలవుల సమస్యలను పరిష్కరించాలి’’ అంటూ నోయిడాలో కార్మికులు చేపట్టిన ఆందోళన హింసకు దారితీసింది. కాగా, కార్మికుల సమస్యలపై నోయిడాలో మొదలైన ఆందోళనలు మెల్లమెల్లగా విస్తరిస్తున్నాయి. ఢిల్లీ,  ఫరీదాబాద్ లో కూడా ఆందోళనలు చెలరేగడం ప్రభుత్వాన్ని టెన్షన్ కు గురిచేస్తుంది.

Also Read: రక్తంతో తడిసి ముద్దైన రోడ్లు.. యాక్సిడెంట్‌లో 18 మంది మృతి

నోయిడాలోని పారిశ్రామిక వాడ ఫేజ్ 2లో చాలా కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ పని చేసే కార్మికులకు ఆయా కంపెనీలు సకాలంలో జీతాలు, వేతనాలు చెల్లించటం లేదన్న ఆరోపణలున్నాయి. నోయిడా పారిశ్రామిక వాడలో కనీస వేతనం నెలకు రూ.13 వేలు గానే ఉంది. పెరిగిన ధరలతో సమానంగా కనీసం వేతనం పెంచాలంటూ కొన్ని రోజులుగా  కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయంపై ఆయా కంపెనీలు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

దీనిపై ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు ‘‘కార్మికులకు వారి హక్కులు దక్కి తీరాలి. పరిశ్రమలు వాటి చట్టాలను కచ్చితంగా పాటించాలి. కానీ కొంతమంది కార్మికులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారు. అలాంటి సంఘ విద్రోహ శక్తులను కఠినంగా శిక్షిస్తాం’’ అని హెచ్చరించారు. ఈ ఆందోళనలపై పారిశ్రామిక యూనిట్లతో తక్షణమే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారాయన.

Advertisment
తాజా కథనాలు