West Bengal : ట్రంప్ బాటలో సువేందు... వెస్ట్ బెంగాల్ సర్కార్ సంచలనం!

అమెరికా ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ నోట పదే పదే వినిపించే మాట.. మెక్సికో సరిహద్దులను మూసేస్తాం.. చొరబాటుదారులను వెనక్కి పంపేస్తాం. ఇప్పుడు సరిగ్గా అదే తరహా మాట ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లోనూ మారుమోగుతోంది.

New Update
suvendu trump

అమెరికా ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ నోట పదే పదే వినిపించే మాట.. మెక్సికో సరిహద్దులను మూసేస్తాం.. చొరబాటుదారులను వెనక్కి పంపేస్తాం. ఇప్పుడు సరిగ్గా అదే తరహా మాట ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లోనూ మారుమోగుతోంది. పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి అనుసరిస్తున్న సరికొత్త సరిహద్దు వ్యూహాలు, తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే.. ఆయన అక్రమ వలసల విషయంలో ట్రంప్ విధానాన్ని అమలు చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. ట్రంప్ అమెరికాలో ఏవైతే కఠినమైన వలస విధానాలను అమలు చేశారో.. ఇప్పుడు సువేందు బెంగాల్‌లో దాదాపు అలాంటి విధానాలకు అమలు చేశారు. 

27 కిలోమీటర్ల మేర ముళ్లకంచె

బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దశాబ్దాలుగా ఖాళీగా ఉండిపోయిన 27 కిలోమీటర్ల మేర ముళ్లకంచె నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అత్యంత వేగంగా భూమిని సేకరించి బీఎస్ఎఫ్ చేతిలో పెట్టారు.  పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించిన  డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్  అనే నినాదం పూర్తిగా ట్రంప్ ఐడియాలజీకి కార్బన్ కాపీలా కనిపిస్తోంది. ఓటర్ లిస్టులు, రేషన్ కార్డుల నుంచి చొరబాటుదారుల పేర్లను తొలగించి, వారిని పక్కాగా ఐడెంటిఫై చేసే పనిని బెంగాల్ యంత్రాంగం వేగవంతం చేసింది.

అమెరికా సరిహద్దుల్లో పట్టుబడిన అక్రమ వలసదారులను కోర్టుల వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు డిటెన్షన్ సెంటర్లలో ఉంచుతారు. ఇప్పుడు బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో సరిగ్గా ఇలాంటి హోల్డింగ్ సెంటర్ ఒకటి ప్రారంభమైంది. నిన్నగాక మొన్న పట్టుబడిన తొమ్మిది మంది బంగ్లాదేశీయులను ఈ కేంద్రంలోనే ఉంచారు. ఇక్కడ బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వారిని నేరుగా సరిహద్దు రక్షక దళాల ద్వారా బంగ్లాదేశ్‌కు తరిమేయనున్నారు. ఇదంతా అమెరికా తరహా ఇమ్మిగ్రేషన్ నిబంధనలనే గుర్తుకు తెస్తోంది.

సువేందు అధికారికి కూడా కేంద్ర ప్రభుత్వం గతేడాది తెచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025 పెద్ద ఆయుధంగా మారింది. వారెంట్ లేకుండానే చొరబాటుదారులను అరెస్ట్ చేసే అధికారాన్ని హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారికి కూడా ఈ చట్టం కల్పించింది. ఈ చట్టబద్ధమైన అధికారంతోనే సువేందు బెంగాల్‌లో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత దూకుడుగా అడుగులు వేస్తున్నారు.

అయితే, మతపరమైన వేధింపుల వల్ల పొరుగు దేశాల నుంచి ప్రాణభయంతో వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మాత్రం ఈ చట్టం కింద మినహాయింపు ఇచ్చారు. 2024 డిసెంబర్ 31లోపు భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులపై ఎలాంటి పోలీసు చర్యలు ఉండవని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే, ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగచాటుగా వచ్చే మిగతా చొరబాటుదారులపై మాత్రం బెంగాల్ ప్రభుత్వం ఇకపై ఉక్కుపాదం మోపనుంది.

Advertisment
తాజా కథనాలు