Rahul Gandhi : మోదీకి నాకు ఆ సమస్య లేదు.. లోక్‌సభలో  రాహుల్ గాంధీ పంచులు!

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.

New Update
rahul gandhi

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. తన ప్రసంగం మొదట్లో సరదాగా మాట్లాడిన రాహుల్.. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

భార్యల సమస్య లేదు

ప్రసంగం ప్రారంభంలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశించి ఒక చమత్కారం చేశారు. "మనందరి జీవితాల్లో మహిళల ప్రభావం ఉంటుంది. తల్లులు, సోదరీమణులు, భార్యల నుంచి మనం ఎంతో నేర్చుకుంటాం. అయితే ప్రధానికి, నాకు భార్యల సమస్య లేదు. కాబట్టి ఆ విషయంలో మాకు ఎటువంటి సలహాలు, సూచనలు అందవని అనడంతో సభలో నవ్వులు పూశాయి. అలాగే, తన సోదరి ప్రియాంక గాంధీ గురించి ప్రస్తావిస్తూ.. గత 20 ఏళ్లలో తాను చేయలేని పనిని ఆమె చేశారని, అమిత్ షా ముఖంలో చిరునవ్వు పూయించారని రాహుల్ చమత్కరించారు.

అయితే, ఆ తర్వాత రాహుల్ గాంధీ సీరియస్ మోడ్‌లోకి వెళ్లారు. కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఆయన తప్పుబట్టారు. ఇది మహిళల సాధికారత కోసం తెచ్చిన బిల్లు కాదని, మహిళల పేరు చెప్పి దేశ ఎన్నికల మ్యాప్‌ను మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఈ బిల్లును ముడిపెట్టడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వం పాత మహిళా రిజర్వేషన్ బిల్లునే (2023లో ఆమోదించినది) వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. "మేము ఈ బిల్లు అమలుకు ఇప్పుడే మద్దతు ఇస్తాం. కానీ ఇప్పుడు తెస్తున్న బిల్లు వెనుక వేరే కుట్ర ఉంది. దేశ చరిత్రలో ఓబీసీలు, దళితులు, మైనారిటీలు, మహిళల పట్ల జరుగుతున్న క్రూరమైన వివక్ష ఒక చేదు నిజం" అని ఆయన పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విరుచుకుపడుతూ.. ఇది రాజ్యాంగంపై మనువాదం సాధించిన విజయంగా అభివర్ణించారు. కుల గణనను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందని, ఓబీసీ సోదర సోదరీమణులకు దక్కాల్సిన అధికారాన్ని, ప్రాతినిధ్యాన్ని ఈ బిల్లు ద్వారా దూరం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. 

Advertisment
తాజా కథనాలు