/rtv/media/media_files/2026/05/31/ipl-2026-05-31-21-48-59.jpg)
IPL 2026 Final
IPL 2026 Final : ఐపీఎల్ 2026 మేగా టోర్నీ తుది సమరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆర్సీబీ బౌలర్లు గట్టి షాకిచ్చారు. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు 8 వికెట్ల నష్టానికి 155 పరుగుల మోస్తరు స్కోరుకే పరిమితమైంది. గుజరాత్ బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ (37 బంతుల్లో 50*) ఒంటరి పోరాటం చేసి బాధ్యతాయుతమైన అర్ధ శతకంతో జట్టును ఆదుకోగా, మిగతా బ్యాటర్లందరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.
గుజరాత్ ఇన్నింగ్స్ ప్రారంభంలో తొలి రెండు ఓవర్లు సాఫీగానే సాగినప్పటికీ, ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు వికెట్ల పతనాన్ని శాసించారు. ప్రమాదకరమైన ఓపెనర్లు సాయి సుదర్శన్ (12), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (10)లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. బంతిని అందుకున్న జోష్ హేజిల్‌వుడ్ తన మొదటి ఓవర్‌లోనే గిల్‌ను అవుట్ చేయగా, ఆ వెంటనే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సాయి సుదర్శన్ వికెట్‌కీపర్ జితేశ్ శర్మకు దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చిన వన్‌డౌన్ బ్యాటర్ నిశాంత్ సింధు (20) పరుగులు చేసి అవుట్ కాగా, స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ (19) కూడా క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయాడు.
ఒకదశలో బట్లర్, నిశాంత్ సింధు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేయడంతో గుజరాత్ కోలుకున్నట్లే కనిపించింది. కానీ రసిఖ్ సలామ్ వేసిన ఎనిమిదో ఓవర్లో నిశాంత్ సింధు అవుట్ కావడంతో రన్ రేట్ ఒక్కసారిగా పడిపోయింది. ఆర్సీబీ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా 9 నుండి 12 ఓవర్ల మధ్య గుజరాత్ కేవలం 18 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒత్తిడికి లోనై దూకుడుగా ఆడలేకపోయిన బట్లర్.. కృనాల్ పాండ్య వేసిన 13వ ఓవర్లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన అర్షద్ ఖాన్ (15)ను హేజిల్‌వుడ్ అవుట్ చేయడంతో గుజరాత్ టైటాన్స్ 14.1 ఓవర్లలో 99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోయింది.
చివర్లో ఫినిషర్ రాహుల్ తెవాతియా (7) కూడా నిరాశపరచగా, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడి జట్టు స్కోరును వంద దాటించాడు. చివరి మూడు ఓవర్లలో గుజరాత్ బ్యాటర్లు వేగంగా ఆడి 34 పరుగులు రాబట్టినప్పటికీ, మరో రెండు వికెట్లను సమర్పించుకోవాల్సి వచ్చింది. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ అత్యుత్తమంగా రాణించి 3 వికెట్లు పడగొట్టగా.. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ చెరో 2 వికెట్లతో శత్రువును దెబ్బతీశారు. అలాగే కృనాల్ పాండ్యకు ఒక వికెట్ దక్కింది. ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టైటిల్ గెలవాలంటే ఇప్పుడు 156 పరుగులు చేయాల్సి ఉంది.
Follow Us