డిజిటల్ అరెస్టుల్లో రూ.120 కోట్లు పోగొట్టుకున్న బాధితులు..

ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు డిజిటల్ అరెస్టుల్లో బాధితులు రూ.120.3 కోట్లు పోగొట్టుకున్నారు. ఈ డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్, రొమాన్స్‌ స్కామ్‌లు, ఇన్వెస్ట్‌మెంట్‌ మోసాలు 46 శాతం మయన్మార్, లావోస్, కంబోడియా నుంచే జరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది.

New Update
Digital Arrest

మన్‌కీ బాత్‌లో ఆదివారం డిజిటల్ అరెస్టుల పేరిట ఆన్‌లైన్‌లో జరుగుతున్న మోసాల గురించి ప్రధాని మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. వీటిని అరికట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని.. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధాని సూచించారు. ప్రస్తుతం ఈ డిజిటల్ అరెస్టుల అంశం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ పలు కీలక విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్, రోమాన్స్‌ స్కామ్‌లు, ఇన్వెస్ట్‌మెంట్‌ మోసాలు అనేవి దాదాపుగా 46 శాతం మూడు దేశాల నుంచే జరుగుతున్నాయి. 

మొత్తం రూ.1,776 కోట్లు నష్టం

మయన్మార్, లావోస్, కంబోడియా దేశాల నుంచే ఎక్కువగా ఈ మోసాలు జరుగుతున్నాయని వెల్లడించింది. సైబర్ నేరగాళ్ల చేతిలో బాధితులు ఇప్పటివరకు రూ.1,776 కోట్లు నష్టపోయారని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ట్రేడింగ్ కుంభకోణంలో రూ.1,420 కోట్లు, ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసాల్లో రూ.222.58 కోట్లు, డిజిటల్ అరెస్టుల్లో రూ.120.3 కోట్లు, అలాగే డేటింగ్/రొమాన్స్ పేరటి రూ.13.23 కోట్లు పోగొట్టుకున్నారు. ఇలాంటి మోసాలు ఏటా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆన్‌లైన్ మోసాలపై ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్యే దాదాపు 7.4 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. 2023లో మొత్తం 15.56 లక్షలు, 2022లో 9.66 లక్షలు, ఇక 2021లో 4.52 లక్షల ఫిర్యాదులు వచ్చాయి.  

Also Read: మహిళా జర్నలిస్టు ఒడిలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే!

తాజాగా హైదరాబాద్‌లో కూడా ఓ డిజిటల్ అరెస్టు జరిగింది. ఐటీ ఉద్యోగం చేస్తున్న 44 ఏళ్ల వ్యక్తిని సైబర్ కేటుగాళ్లు బెదిరించి 24 గంటల పాటు డిజిటల్ అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే శుక్రవారం రాత్రి నుంతి అతని ఫోన్‌కు మెసేజ్‌లు వచ్చాయి. అవి స్పామ్ అని అతడు పట్టించుకోలేదు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఓ కొరియర్ ఏజెంట్, అలాగే ముంబయి పోలీసులు ఫోన్‌ చేస్తున్నట్లుగా అతడికి ఫోన్లు వచ్చాయి. అతడి ఆధార్‌కార్డ్ నెంబర్‌కు మనీలాండరింగ్‌తో సంబంధం ఉందన్నారు. అతడి అకౌంట్‌ చెక్‌ చేసేవరకు వాట్సాప్‌ వీడియోకాల్‌లో కొనసాగాలని కోరారు. 

అలాగే అతడిని ఇంటినుంచి దూరంగా వచ్చి ఓ లాడ్జిలో ఉండాలని చెప్పారు. సోమవారం ఉదయం బ్యాంకులు తెరిచేవరకు అక్కడే ఉండాలన్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ వ్యవహారం అలాగే కొనసాగింది. అయితే ఒక్కసారిగా కాల్‌ కట్‌ కావడంతో బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. బ్యాంకు మూసి ఉండటం వల్ల అతడి అకౌంట్‌లో ఉన్న డబ్బులు సేఫ్‌గా ఉన్నాయి. ఇలాంటి ఫోన్ కాల్స్ చేసి డిజిటల్ అరెస్టులకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు బాధితులు లక్షల రూపాయలు దండుకున్నారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.  

Also Read: కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. సర్కార్ ఫిక్స్ చేసిన డేట్ ఇదే!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు