/rtv/media/media_files/2026/05/12/foreign-tours-2026-05-12-12-32-51.jpg)
Foreign tours
UN Tourism : విదేశీ ప్రయాణాల కోసం భారతీయులు రికార్డు స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ మారక ద్రవ్యాన్ని (Foreign Exchange) ఆదా చేసేందుకు భారతీయులు తమ విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశ ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రధాని ఈ విజ్ఞప్తి చేశారు. అయితే, కోవిడ్ మహమ్మారి తర్వాత భారతీయుల్లో విదేశీ ప్రయాణాల పట్ల క్రేజ్ విపరీతంగా పెరిగింది.ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా విదేశీ పర్యటనల కోసం ఖర్చు చేస్తున్న దేశాల జాబితాలో భారతదేశం కూడా చేరింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
విదేశీ పర్యటనల్లో భారత్ సరికొత్త రికార్డు
ఐక్యరాజ్యసమితి పర్యాటక సంస్థ (UN Tourism) నివేదిక ప్రకారం, 2024 సంవత్సరంలో భారతీయ పర్యాటకులు విదేశీ ప్రయాణాల కోసం ఏకంగా 35 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఈ భారీ ఖర్చుతో ప్రపంచంలోనే అత్యధికంగా అవుట్‌బౌండ్ టూరిజం (స్వదేశం నుండి విదేశాలకు వెళ్లే పర్యాటకులు) మార్కెట్ కలిగిన దేశాల జాబితాలో భారత్ 10వ స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో చైనా 250.6 బిలియన్ డాలర్ల ఖర్చుతో మొదటి స్థానంలో ఉండగా, అమెరికా 177.8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది.కోవిడ్ మహమ్మారికి ముందు, అంటే 2019లో భారతీయుల విదేశీ ప్రయాణ ఖర్చు 22.9 బిలియన్ డాలర్లుగా ఉండేది. 2024 నాటికి ఇది 41 శాతం వృద్ధితో 35 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రాబోయే రోజుల్లో ఈ ధోరణి మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. ప్రముఖ ఆర్థిక పరిశోధన సంస్థ బెర్న్‌స్టెయిన్ (Bernstein) నివేదిక ప్రకారం, 2027 నాటికి భారతీయుల విదేశీ ప్రయాణాల ఖర్చు 89 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద అవుట్‌బౌండ్ ట్రావెల్ మార్కెట్‌గా అవతరిస్తుంది.
భారతీయులు విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు?
భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికల ప్రకారం, భారతీయులు విదేశాలకు వెళ్లడానికి వివిధ కారణాలు ఉన్నాయి. అందులో ముఖమైనవి వినోదం/టూర్లు (Leisure Travel). విదేశీ ప్రయాణాల్లో అత్యధికంగా 43.5 శాతం మంది కేవలం సరదాగా గడపడానికి, కొత్త ప్రదేశాలను సందర్శించడానికి వెళ్తున్నారు.బంధువులు, స్నేహితులను కలవడానికి సుమారు 34.1 శాతం మంది, విదేశాల్లో ఉంటున్న తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను సందర్శించడానికి వెళ్తున్నారు. దాదాపు 14.6 శాతం మంది వ్యాపార పనులు, అధికారిక ఒప్పందాల కోసం విదేశాలకు ప్రయాణిస్తున్నారు.
భారతీయుల ఫేవరెట్ దేశాలు ఇవే!
బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ గణాంకాల ప్రకారం, భారతీయులు సందర్శించడానికి అత్యధికంగా ఇష్టపడుతున్న మొదటి ఐదు దేశాల వివరాలు:
1.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) : దుబాయ్ సందర్శన కోసం భారతీయులు అత్యధికంగా ఇక్కడికే వెళ్తున్నారు.
2.సౌదీ అరేబియా :ఉపాధి, వ్యాపారం ,ఆధ్యాత్మిక యాత్రల పరంగా రెండో స్థానంలో నిలిచింది.
3.అమెరికా (USA): ఉన్నత చదువులు, ఉద్యోగాలు, పర్యాటకం కోసం కీలక గమ్యస్థానం.
4.థాయిలాండ్ : బడ్జెట్ ఫ్రెండ్లీ పర్యాటక దేశంగా భారతీయులను ఆకర్షిస్తోంది.
5.సింగపూర్: వినోదం, షాపింగ్ కోసం భారతీయులు ఎక్కువగా ఇష్టపడే దేశం.
ప్రయాణాలు ఎక్కువగా చేసే నెలలు
భారతీయులు విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు కొన్ని ప్రత్యేక సీజన్లను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా మే, డిసెంబర్, ఆగస్టు, సెప్టెంబర్, ఏప్రిల్ నెలల్లో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది.దేశాల వారీగా చూస్తే, యూఏఈ,సౌదీ అరేబియా దేశాలకు భారతీయులు ఎక్కువగా ఆగస్టు నెలలో ప్రయాణిస్తున్నారు. అదేవిధంగా, అమెరికా,సింగపూర్ దేశాలకు మే నెలలో స్కూళ్లకు వేసవి సెలవులు ఉన్న సమయంలో కుటుంబాలతో కలిసి వెళ్తున్నారు. ఇక థాయిలాండ్ విషయానికి వస్తే, క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలు (న్యూ ఇయర్) జరుపుకోవడానికి డిసెంబర్ నెలలో భారతీయ పర్యాటకులు భారీ సంఖ్యలో అక్కడికి తరలివెళ్తున్నారు.
Follow Us