Assembly Election Results-2026 : ఉత్కంఠ రేపుతున్నకౌంటింగ్...నిమిషనిమిషానికి మారుతున్న ఫలితాలు

సాధారణంగా ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే, ఆ రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం స్థానాల్లో సగానికంటే ఎక్కువ (50% + 1) స్థానాలను గెలవాల్సి ఉంటుంది. దీనినే 'మ్యాజిక్ ఫిగర్' అంటారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి.

New Update
2026 Assembly Election Results

2026 Assembly Election Results

BREAKING : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడు

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే ఏ పార్టీ లేదా కూటమికైనా కనీసం 118 స్థానాల్లో విజయం సాధించడం తప్పనిసరి. ఈ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకున్న వారే కోటపై జెండా ఎగురవేస్తారు.

పశ్చిమ బెంగాల్

భారతదేశంలోని పెద్ద రాష్ట్రాలలో ఒకటైన పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మెజారిటీ మార్కు 148 స్థానాలు. ఏ పార్టీ అయితే ఈ 148 సీట్లను గెలుచుకుంటుందో, వారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తారు.

కేరళ

కేరళ రాష్ట్ర శాసనసభలో మొత్తం 140 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 71. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఎల్‌డిఎఫ్ (LDF) మరియు యుడిఎఫ్ (UDF) కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంటోంది.

అసోం

ఈశాన్య రాష్ట్రమైన అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ అధికారం చేపట్టాలంటే ఏ పార్టీకైనా 64 స్థానాల మద్దతు అవసరం. ఈ మ్యాజిక్ ఫిగర్‌ను సాధించిన పార్టీ లేదా కూటమి అసోం పీఠాన్ని దక్కించుకుంటుంది.

పుదుచ్చేరి

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ స్థానాల సంఖ్య చాలా తక్కువ. ఇక్కడ మొత్తం 30 నియోజకవర్గాలు ఉండగా, అధికారం పొందడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కేవలం 16. అంటే 16 స్థానాలు గెలిచిన పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని నడపవచ్చు.

పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఉత్కంఠభరితంగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ 

పశ్చిమ బెంగాల్: హోరాహోరీ పోరులో బీజేపీ ముందంజ!

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలి ట్రెండ్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతోంది. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్‌ రాజకీయం ప్రస్తుతం టీఎంసీ (TMC), బీజేపీల మధ్య హోరాహోరీగా సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బీజేపీ ముందంజలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.50 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. వీటి లెక్కింపులో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండటం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు దాదాపు పూర్తి కావస్తుండటంతో, అధికారులు EVMల లెక్కింపును ప్రారంభించారు. మ్యాజిక్ ఫిగర్ 148ని ఎవరు చేరుకుంటారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ నాలుగోసారి అధికారం నిలబెట్టుకుంటుందా? లేక బీజేపీ బెంగాల్ పీఠాన్ని దక్కించుకుంటుందా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

తమిళనాడు: పోస్టల్ బ్యాలెట్‌ లెక్కింపులో DMK ముందంజలో ఉంది. పెరంబూర్‌లో టీవీకే చీఫ్ విజయ్‌  ఆధిక్యంలో  ఉన్నారు. తిరుచ్చి ఈస్ట్‌లో మాత్రం ఆయన వెనకబడ్డారు.
 
కేరళం: LDF, UDF మధ్య హోరాహోరీ పోటీ ఉంది.  కేరళలో ఈసారి బీజేపీ గట్టి పోటీనిస్తోంది. కాంగ్రెస్ మరియు లెఫ్ట్ పార్టీలకు దీటుగా బీజేపీ తన ఉనికిని చాటుకుంటోంది. ఒకవేళ కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తే, రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.దక్షిణాది రాష్ట్రం కేరళలో కూడా కౌంటింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇక్కడ మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మెజారిటీ మార్కు 71. ప్రారంభ ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) ఆధిక్యంలో కొనసాగుతోంది. 3,68,193 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో యూడీఎఫ్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
 పోస్టల్ బ్యాలెట్ల అనంతరం EVM కౌంటింగ్ మొదలైంది. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ (LDF) హ్యాట్రిక్ విజయం సాధిస్తుందా? లేక కేరళలో అధికార మార్పిడి సంప్రదాయం కొనసాగుతూ యూడీఎఫ్ గెలుస్తుందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.

ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ల ట్రెండ్స్ మాత్రమే వెలువడ్డాయి. EVMల లెక్కింపు పూర్తయ్యేసరికి ఈ సమీకరణాలు మారే అవకాశం ఉన్నప్పటికీ, ఇరు రాష్ట్రాల్లోనూ విపక్షాలు గట్టి పోటీ ఇస్తుండటం విశేషం.

Advertisment
తాజా కథనాలు